పుతిన్ రాక..25 ఏళ్లలో అత్యంత కనిష్ఠానికి భారత్-అమెరికా సంబంధాలు
చరిత్రలో అమెరికాతో భారత్ కు మొదటినుంచి సత్సంబంధాలు లేవు. అయితే, సాఫ్ట్ వేర్ బూమ్ అనంతరం ఇరు దేశాలు చాలా దగ్గరయ్యాయి.;
చరిత్రలో అమెరికాతో భారత్ కు మొదటినుంచి సత్సంబంధాలు లేవు. అయితే, సాఫ్ట్ వేర్ బూమ్ అనంతరం ఇరు దేశాలు చాలా దగ్గరయ్యాయి. పరస్పర అవసరాలను గుర్తించి నడుచుకున్నాయి. తమ మధ్య పాత కాలం విభేదాలు ఎలా ఉన్నా ఇప్పటి అవసరాలను బట్టి సర్దుకున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ అమెరికా నగదు డాలర్ తో పోలిస్తే 90 (నాటౌట్)కి చేరి ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనంగా మారాయి. దీనికి కారణం.. రాజకీయంగా ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన, భౌగోళిక-రాజకీయ ఒత్తిళ్లు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు పరీక్షా కాలం అని పేర్కొంటున్నాయి.
అటు-ఇటు ప్రభుత్వాలు మారినా..
గత 25 ఏళ్లలో అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, భారత్ లో కాంగ్రెస్, బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ, ఇరు దేశాల సంబంధాలు మాత్రం మరింత బలపడ్డాయి. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును గ్రహించిన అమెరికా భారత్ తో స్నేహంగా మసలుకోవడం ప్రారంభించింది. లక్షలాది మన టెక్ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండడంతో భారత్ కూడా అంతేస్థాయిలో వ్యవహరించింది.
ట్రంప్ 2.0లో దెబ్బ..
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా భారత్-అమెరికా సంబంధాలను దిగజార్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలు, భారత వస్తువులపై భారీగా టారిఫ్ లు, అక్రమ వలసలపై ఉక్కుపాదం, వీసాల విషయంలో వరుసగా నిర్ణయాలు తదితర కారణాలతో 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత కింది స్థాయికి చేరాయి. అయితే, 2016-20 మధ్య ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సంబంధాలు బలపడిన సంగతిని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. 2019లో అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమం, 2020 ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన తర్వాత.. చైనాతో భారత్ ఘర్షణ సమయంలో అమెరికా ఇచ్చిన మద్దతును ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇప్పుడు అత్యంత దారుణంగా మారిందని అంటున్నారు.
పుతిన్ విషయంలో ఎలా స్పందిస్తుందో...?
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్ ను తానే నిలువరించానంటూ ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత సుంకాల బాదుడు మొదలుపెట్టారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ఓవల్ కార్యాలయానికి ఆహ్వానించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇది అమెరికాకు అత్యంత ఆగ్రహం తెప్పించే విషయం అనడంలో సందేహం లేదు.
సహజ మిత్రులు లేరు.. ఎవరూ చాంపియన్లు కాదు..
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, రాజకీయ, భౌగోళిక ఘర్షణల రీత్యా అమెరికా-భారత్ వ్యవహారాల్లో ఎవరూ చాంపియన్లు అనేందుకు వీల్లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ -అమెరికాను సహజ మిత్రులుగా పేర్కొనేందుకూ అవకాశం లేదంటున్నారు. ఒకవేళ చైనా ఎదుగుదలను అమెరికా ముప్పుగా భావించి భారత్ తో సంబంధాలను పునర్ నిర్వచిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని విశ్లేషిస్తున్నారు.