టెక్ ప్రపంచం సిత్రం.. ఓవైపు లేఆఫ్ లు.. సీఈవోలకు కోట్లల్లో చెల్లింపులు

ఏ ముహుర్తంలో కనుగొన్నారో కానీ మాయదారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పుణ్యమా అని టెక్ ప్రపంచంలో రేగిన కలకలం అంతా ఇంతా కాదు.;

Update: 2025-05-29 03:58 GMT

ఏ ముహుర్తంలో కనుగొన్నారో కానీ మాయదారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పుణ్యమా అని టెక్ ప్రపంచంలో రేగిన కలకలం అంతా ఇంతా కాదు. ఏఐ విశ్వరూపం సినిమా ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు విడుదలైంది టీజర్ మాత్రమే అన్న వేళలోనే భారీ ఎత్తున కొలువులకు కోతలు పడుతున్నాయి. రంగం ఏదైనా.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఏఐ మాట వినిపిస్తున్న పరిస్థితి. అన్నింటికి మించి టెక్ రంగానికి చెందిన వారు మాయదారి ఏఐ తమ భవిష్యత్తును ఏ దరికి చేరుస్తుందోనన్న భావనతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు టెక్ సంస్థల సీఈవోల పారితోషికాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ట్రెండ్ నడుస్తోంది. భారతదేశానికి వస్తే..తాజాగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో కృతి వాసన్ కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26.52 కోట్ల పారితోషికాన్ని అందుకున్న వైనం వెలుగు చూసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 4.6 శాతం ఎక్కువ కావటం గమనార్హం. తాజాగా ఈ అంశం కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది.

కృతి వాసన్ అందుకున్న పారితోషికంలో బేసిక్ శాలరీ రూ.1.39 కోట్లు కాగా.. అలవెన్సులు.. ఇతర ప్రయోజనాల రూపంలో రూ.2.12 కోట్లు పొందినట్లుగా పేర్కొన్నారు.అంతేకాదు కంపెనీ లాభాల్లో వాటా (కమీషన్) రూపంలో ఆయన రూ.23 కోట్లు అందుకున్నారు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. టీసీఎస్ లోని మొత్తం 6.07 లక్షల మంది ఉద్యోగులకు చెల్లించే సగటు జీతం కంటే ఇది దాదాపు 330 రెట్లు అధికం కావటం గమనార్హం.

ఈ వేళలో ఒక ఆసక్తికర ప్రశ్న చాలామంది మదిలో మెదలొచ్చు. మన దేశంలో అత్యధిక పారితోషికాలు పొందిన టాప్ 10 టెక్ కంపెనీల సీఈవోలు ఎవరు? వారు అందుకుంటున్న వార్షిక పారితోషికం ఎంతన్నది చూస్తే.. ఉద్యోగులకు సీఈవోలకు మధ్య పారితోషిక వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఈ టాప్ 10 జాబితాలో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి రూ.186 కోట్లతో మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో కో ఫోర్జ్ (Coforge) సీఈవో సుధీర్ సింగ్ కు రూ.105.12 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు.

ఈ ఇద్దరి మినహా మిగిలిన ఎనిమిది మంది జాబితాను చూస్తే..

సంస్థ పేరు సీఈవో పేరు వార్షిక పారితోషికం (కోట్లల్లో)

హెచ్ సీఎల్ విజయ కుమార్ 84.1

పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సందీప్ కర్లా 77.1

ఇన్ఫోసిస్ శాలిల్ పరేఖ్ 66.2

ఎంఫసిస్ నితిన్ రాకేశ్ 59.2

విప్రో శ్రీనివాస్ పిళ్లై 53.6

టీసీఎస్ కృతి వాసన్ 26.5

టెక్ మహీంద్రా మోహిత్ జోషి 17.5

ఎల్ టీఐ మైండ్ ట్రీ దేబాషిస్ చటర్జీ 17.5

Tags:    

Similar News