వేరే లెవెల్ వాయింపు... యునెక్సో లో పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు!

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ పై భారత్ బలంగా విరుచుకుపడింది!;

Update: 2025-05-24 04:03 GMT

మనుషులను కాటు వేసి, వారి శరీరంలోకి విషం ఎక్కించడం పాపం అని పాము చెబితే ఎలా ఉంటుంది.. అంతర్జాతీయ శాంతి సమావేశాలకు బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాది అధ్యక్షత వహిస్తే ఎలా ఉంటుంది.. పౌర రక్షణ చర్చల్లో పాకిస్థాన్ పాల్గొని ప్రసంగించడం కూడా అలానే ఉంటుందనే రేంజ్ లో పాక్ పై విరుచుకుపడింది భారత్. అందుకు వేదికైంది యునెస్కో సమావేశం!

అవును... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ పై భారత్ బలంగా విరుచుకుపడింది! సంఘర్షణ ప్రాంతాల్లో పౌర రక్షణపై చేపట్టిన చర్చల్లో పాకిస్థాన్ పాల్గొనడం అంటే అది అంతర్జాతీయ సమాజానికి అవమానం అని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత శాస్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పూరి ఇచ్చిపడేశారు. పాక్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ" అనే అంశంపై యునెస్కో బహిరంగం చర్చలో ప్రసంగించిన హరీష్ పూరి.. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రదాడులను భారత్ దశాబ్ధాలుగా ఎదుర్కొందని అన్నారు. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని దేశానికి పౌరుల రక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని.. ఆ దేశం పౌరుల రక్షణపై చర్చల్లో పాల్గొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి అవమానం అని తెలిపారు.

ఈ సందర్భంగా.. ఇటీవల జరిగిన ఉద్రిక్త పరిస్థితుల విషయాన్ని ప్రస్థావించిన హరీష్... ఇటీవల పాకిస్థాన్ దాడుల్లో 20 మందికి పైగా పౌరులు మరణించారని.. 80 మందికి పైగా గాయపడ్డారని.. ప్రార్థనా స్థలాలు, స్కూళ్లు, హాస్పటల్స్ లను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఈ సంస్థ వద్ద బోధించడం కపటత్వం అని అన్నారు.

ఇదే సమయంలో... ఆపరేషన్ సిందూర్ లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సైనిక అధికారులు ఇటీవల హాజరై నివాళులు అర్పించడం చూశామని గుర్తు చేసిన హరీష్ పూరి.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్థాన్ పదే పదే పౌర కవచాన్ని ఉపయోగిస్తోందని.. అలాంటి దేశం పౌర రక్షణ గురించి మాట్లాడుతోందని అన్నారు.

ఈ క్రమంలోనే.. నాడు ముంబై నగరంపై జరిగిన 26/11 భయంకరమైన దాడి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన పాశవిక హత్యల వరకూ.. పాకిస్థాన్ ఉగ్రవాద బాధితులు ప్రధానంగా పౌరులే అని.. అటువంటి దేశం పౌరుల రక్షణపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానం అని హరీష్ మండిపడ్డారు!

Tags:    

Similar News