ఇరాన్ - అమెరికా దాడి.. అసత్య ప్రచారాలు ప్రత్యర్ధులను భయపెడతాయా?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా మీడియా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.;
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా మీడియా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత నావల్ బేస్‌లను అమెరికా వాడుకుంటోందంటూ వస్తున్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని భారత విదేశాంగ శాఖ గట్టిగా బదులిచ్చింది. అసలు ఈ తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? యుద్ధ సమయంలో ఇలాంటి వార్తలు ప్రత్యర్థులను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూద్దాం ..
అమెరికా మీడియా సంచలన కథనం.. భారత్ రియాక్షన్:
ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో అమెరికాకు చెందిన కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడుల్లో తమ నావల్ బేస్‌లు, హార్బర్లు ధ్వంసం అయ్యాయని, అందుకే భారత్ సాయం కోరాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వార్తలను అమెరికన్ మీడియా సంస్థ ప్రముఖంగా ప్రసారం చేసింది. అయితే, ఈ వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇక ఇవన్నీ కల్పితాలని, భారత నౌకాశ్రయాలను అమెరికా ఆర్మీ వాడుకుంటోందన్న మాటల్లో వాస్తవం లేదని అధికారికంగా స్పష్టం చేసింది.
అసత్య ప్రచారాలు.. యుద్ధ తంత్రంలో భాగమేనా?:
ఇక యుద్ధం కేవలం సరిహద్దుల్లో ఆయుధాలతోనే జరగదు, సమాచారంతో కూడా జరుగుతుంది. దీన్నే 'ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్' అంటారు. ప్రత్యర్థి దేశాలను మానసికంగా దెబ్బతీయడానికి లేదా ప్రపంచ దేశాల మద్దతు తమకే ఉందని నమ్మించడానికి ఒక్కోసారి ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టిస్తుంటారు. ఇక భారత్ వంటి శక్తివంతమైన దేశం తమ వెనుక ఉందనే సంకేతాలను పంపడం ద్వారా ఇరాన్ వంటి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టవచ్చనేది ఒక వ్యూహం కావచ్చు. కానీ, భారత్ తన తటస్థ వైఖరిని కాపాడుకుంటూ, ఇలాంటి నిరాధారమైన ప్రచారాలకు తావులేకుండా క్లారిటీ ఇచ్చింది.
అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం!:
ఇలాంటి సున్నితమైన సమయాల్లో వచ్చే తప్పుడు వార్తలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులకు దారితీస్తాయి. భారత్ ఎప్పుడూ తన సంకల్పాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇతర దేశాల యుద్ధాల్లో తమ భూభాగాన్ని వాడనివ్వడం అనేది భారత విదేశాంగ విధానానికి విరుద్ధం. అందుకే అమెరికా మీడియా చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ వెంటనే ఖండించి, ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టుగా, ఎంతటి ప్రచారం జరిగినా నిజాలు ఎక్కువ రోజులు దాగవుఅని భారత్ మరోసారి నిరూపించింది.