'సింధూ' బాధ్యత ‘పెద్దన్న’పైనే పెట్టిన పాక్.. ప్రధాని కీలక వ్యాఖ్యలు!

శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్..;

Update: 2025-05-11 04:36 GMT

గత కొన్ని రోజులుగా భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత చల్లబడుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. అనంతరం పాక్ ప్రధాని స్పందించారు.

పహల్గాం ఉగ్రదాడితో మొదలైన భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ‘ఆపరేషన్ సిందూర్’ తో మరింత వేడెక్కింది.. ఈ క్రమంలో రెండు, మూడు రోజులు యుద్ధ వాతావరణం కొనసాగింది. అయితే అది కాస్త అమెరికా దౌత్యంతో శనివారం సాయంత్రం చల్లబడింది! ఈ సమయంలో ఈ అంగీకారం కాల్పుల విరమణ వరకేనా అనే చర్చ మొదలైంది.

అవును.. భారత్ – పాక్ ఒప్పందం కాల్పుల విరమణవరకేనా.. లేక, పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాల విషయంలో కూడానా అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రధానంగా సింధూ నదీజలాల ఒప్పందం రద్దు రద్దయ్యే విషయంపైనా కూడానా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్... భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయం చేసినందుకు డొనాల్డ్ ట్రంప్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, టర్కీ, ఇతరులకు కృతజ్ఞలు అని అన్నారు. చైనా గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ... పాకిస్థాన్ కు 'అత్యంత విశ్వసనీయ స్నేహితుడు' అని పిలిచారు.

ఈ క్రమంలోనే... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఒకటైన సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్థావించారు పాక్ ప్రధాని. ఇందులో భాగంగా... సింధూ జలాల ఒప్పందానికి సంబంధించిన విషయాలలో కూడా అంతర్జాతీయ సమాజం చురుకుగా పాల్గొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దీంతో.. మే 12 మధ్యాహ్నం 12 గంటలకు జరిగే భారత్ – పాక్ దేశాల ఉన్నత స్థాయి దౌత్య చర్చల్లో వీసాల పునరుద్ధరణ, సింధూ నదీజలాల ఒప్పందంపై చేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం పునఃప్రారంభం వంటి విషయాలపైనా క్లారిటీ రావొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News