'పాక్ నుంచి ఫోన్'... కాల్పులు విరమణ ప్రకటించిన భారత్!
ఈ క్రమంలో పలువురు పౌరులు మరణించారు, గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సమయంలో... భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.;
గత మూడు రోజులుగా భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వందల డ్రోన్లు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలతో భారత్ పై విరుచుకుపడుతుంది. ఆ ప్రయత్నాలను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొడుతుంది. ఈ క్రమంలో పలువురు పౌరులు మరణించారు, గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సమయంలో... భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
అవును... గత మూడు రోజులుగా భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ... భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన మిస్రీ... పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్ డీజీఎంవో కు ఫోన్ చేశారని.. ఇరు పక్షాలు భూమిపైనా, గాలిలో, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించాయని తెలిపారు.
ఇదే సమయంలో ఈ అండర్ స్టాండింగ్ ని అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయని.. మే 12న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మళ్లీ మాట్లాడతారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఇదే సమయంలో... కాల్పుల విరమణపై ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు.
స్పందించిన పాకిస్థాన్!:
ఈ సందర్భంగా పాకిస్థాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పాకిస్థాన్, భారత్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ శాంతిభద్రతల కోసమే పాటుపడుందని చెప్పడం గమనార్హం.
డొనాల్డ్ ట్రంప్ పోస్ట్:
ఇలా భారతదేశం కాల్పుల విరమణను నిర్ధారించి, చర్చలను వివరించడానికి కొన్ని నిమిషాల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ... అది భారత్ – పాక్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల ఫలితమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్... "అమెరికా మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారతదేశం, పాకిస్థాన్ అంగీకరించాయి.. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి.. అందుకు ధన్యవాదాలు" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.