అహంకారం కొన్ని గంటల్లో మాయం... పాక్ కీలక ప్రకటన!
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.;
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాక్, పీవోకేలోని 9 ఉగ్ర శిభిరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే... ఈ దాడికి ముందు వరకూ పాకిస్థాన్ నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు చల్లబడటం గమనార్హం. ఇందులో భాగంగా... పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ... భారత్ గనుక పాక్ పై దాడి చేసే సాహసానికి ఒడిగడితే.. ప్రపంచంలో ఎవరూ మిగలరని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన మాట పూర్తిగా మారింది.
అవును... ఆపరేషన్ సిందూర్ కి ఒక్కరోజు ముందు మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. తమ దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా, భారత్ తమపై దాడికి పాల్పడినా.. ఆ తర్వాత ఎవరూ మిగలరని హెచ్చరించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి భారత్ దాడుల అనంతరం ఆయన మాట పూర్తిగా మారింది.. అహంకారం తగ్గినట్లుగా వస్తుంది!
ఇందులో భాగంగా... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి... భారత్ ప్రస్తుతం ఆపరేషన్లను ఆపితే తాము ఆపుతామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ సమయంలో భారత్ దాడులు ఆపితే సంయమనం పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. పాకిస్థాన్ యుద్ధం కోరుకోవట్లేదని చెప్పుకొచ్చారు.
మరోపక్క భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ దాడులను "యుద్ధ చర్య"గా ఖండించారు. తగిన సమాధానం ఇస్తామని, దీనిపై స్పందించే హక్కు పాకిస్థాన్ కు ఉందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ సాయుధ దళాలకు శత్రువుతో ఎలా వ్యవహరించాలో తెలుసని, శత్రువు ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు.