అగ్రరాజ్యం అడుగు పడని నేల.. ఇండియా అంటే ఇదే కదా..
అయితే ఇరాన్ పై యుద్ధం వేళ భారత్ భూభాగం వినియోగానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం విస్తృత చర్చకు దారితీసింది.;
భారత్ భూభాగం నుంచి ఇరాన్ పై దాడి జరిగిందన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం, విదేశాంగశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి భారత్ భూభాగం వాడటాన్ని అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ పై యుద్ధ అవసరాలకు భారత భూభాగాలను అమెరికా అడిగినట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ కథనాలు నిరాధారమైనవని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా శ్రీలంక జలాల్లో ఇరాన్ నౌకపై జరిగిన దాడికి భారత్ కు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఇరాన్ పై యుద్ధం మొదలైన తర్వాత శ్రీలంక జలాల్లో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిని అమెరికా భారత్ భూభాగం నుంచే ఆపరేట్ చేసిందని అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ‘ఎక్స్’లో స్పష్టత ఇచ్చింది. అమెరికాతో భారత్ మిలటరీ ఒప్పందాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించింది. అమెరికాతో ఒప్పందం కేవలం మిలటరీ వసతులను ఉపయోగించుకోడానికి మాత్రమేనని వెల్లడించింది. 2016లో భారత్, అమెరికా మధ్య లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరండమ్ ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) కుదిరింది. దీని ప్రకారం యుద్ధ విమానాలు చమురు నింపుకునేందుకు వీలు కల్పించడమైంది. అదేవిధంగా వాటి మరమ్మతులకు సహకరించడానికి వీలు కల్పించారు.
అయితే ఇరాన్ పై యుద్ధం వేళ భారత్ భూభాగం వినియోగానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం విస్తృత చర్చకు దారితీసింది. ఇది భారత అలీన విధానానికి వ్యతిరేకమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. భారత దేశ ప్రయోజనాలు కాపాడటానికి దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానాన్ని కాపాడుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అలీన విధానం అంటే ప్రపంచంలో ఏ దేశానికి మద్దతుగా వ్యవహరించకుండా అందరితో మితృత్వం కోరుకునే తటస్థ వైఖరిగా వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ అనే రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పుడు మొదటి ప్రధాని నెహ్రూ ఏ వర్గంలోనూ చేరకుండా 'అలీన విధానాన్ని' ఎంచుకున్నారు.
ఏ ఒక్క దేశంపై ఆధారపడకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. భారత భూభాగంపై విదేశీ సైనిక స్థావరాలకు అనుమతి ఇస్తే, అది మనం వేరే దేశానికి బానిసలుగా మారామనే సంకేతాన్ని ఇస్తుందని భారత్ భావించింది. దీంతో 1947 నుంచి ఇప్పటివరకు అలీన విధానాన్నే కొనసాగిస్తోంది. ఇక అమెరికా ప్రపంచ వ్యాప్తంగా తన సైనిక స్థావరాలను విస్తరిస్తున్నా, మన దేశంలో మాత్రం తన స్థావరాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.
ప్రస్తుతం అమెరికాకు ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో 750 వరకు సైనిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా మిత్రదేశాలు అన్నింటిలోనూ సైనిక శిబిరాలు నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు మన దేశం మాత్రం అమెరికా సహా ఏ దేశానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ విధానం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా భారత గడ్డపై అడుగు పెట్టలేకపోవడాన్ని హైలెట్ చేస్తూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.