మీడియాలో 'స్తబ్దత'.. మంచిదేనా?
ఉదాహరణకు ఏపీలో జరిగిన సెకీ ఒప్పందం.. ఈ క్రమంలో చేతులు మారిన సొమ్ము.. వంటివి అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెలికి తీసే వరకు బయటకు రాలేదు.;
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మీడియాలో ఒక స్తబ్దత రాజ్యమేలుతోంది!. ఇది మీడియా అంటే గిట్టని వారు.. మీడియా పై నిందలు వేసే వారు చెబుతున్న మాట కాదు. ఐక్యరాజ్యసమితి లోని మీడియా విభాగం ప్రపంచ స్థాయి మీడియాపై చేసి సర్వేలో ఇటీవల వెల్లడించిన విషయాలు. భారత దేశానికి వచ్చే సరికి.. ఒక స్తబ్దత రాజ్యమేలుతోందన్నది ఈ సర్వే సారాంశం.
ముఖ్యంగా భావప్రకటనా స్వచ్ఛకు అగ్రతాంబూలం ఇచ్చే భారత్ వంటి దేశాల్లో.. మీడియాకు ప్రాధాన్యం ఉంది. కానీ, 2014 తర్వాత.. ఎందుకో.. మీడియా స్తబ్దతకు తార్కాణంగా మారిందన్నది ఐక్యరాజ్యసమితి చేసిన విశ్లేషణ. అంతేకాదు.. భారత్‌లో చోటు చేసుకున్న అనేక పరిణామాలను.. ప్రపంచ దేశాలకు చెందిన మీడియా ప్రొజెక్టు చేసేవరకు కూడా బయటకు రాకపోవడాన్ని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.
ఉదాహరణకు ఏపీలో జరిగిన సెకీ ఒప్పందం.. ఈ క్రమంలో చేతులు మారిన సొమ్ము.. వంటివి అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెలికి తీసే వరకు బయటకు రాలేదు. అదేవిధంగా ఇటీవల గౌతం అదానీకి.. ఎల్ ఐసీ షేర్లను బదలాయిస్తున్న వ్యవహారం కూడా.. ఫ్రెంచ్ పత్రిక బయట పెట్టే వరకు వెలుగు చూడని విషయాన్ని కూడా ఐక్యరాజ్యసమితి ప్రస్తావించింది. ఇవి మీడియాలో నెలకొన్న స్తబ్దతకు ఉదాహరణలని పేర్కొంది.
ఇదేసమయంలో 2014కు ముందు 2-జీ స్పెక్ట్రం కుంభకోణం స్థానిక మీడియా ద్వారానే వెలుగు చూసిన విషయాన్ని ప్రస్తావించింది. ఇక, ప్రత్యేకంగా పేర్కొనకపోయినా.. `స్థానిక` మీడియా సంస్థల్లోనూ విధానపర మైన పక్షవాతం(ఆర్గనైజేషనల్ పెరాలిసిస్) కొనసాగుతోందని సమితి తెలిపింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇబ్బంది కలిగించే అంశమని అభిప్రాయపడడం గమనార్హం.
అయితే.. ఒక్క భారత్‌లోనే ఇలా ఉందా? ఇతర దేశాల్లో లేదా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతూ.. `విశ్వగురు`గా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తున్న భారత్‌ను తలమానికంగా భావిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం.