డీలిమిటేషన్ చేసి తీరాల్సిందే....ఎందుకంటే ?
| 1971 జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను స్థిరీకరించిన తర్వాత దేశ జనాభా భారీగా పెరిగింది. దీంతో ఒక్కో ఎంపీపై ప్రజల ప్రాతినిధ్య భారం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా వ్యత్యాసాలను తగ్గించేందుకు డీలిమిటేషన్ అవసరమని, లోక్‌సభ సీట్లను 816 నుంచి 850 వరకు పెంచే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోందని కథనం పేర్కొంది.
ఏదో ఒక విధానం ఎంచుకుని డీలిమిటేషన్ ప్రక్రియను దేశంలో లోక్ సభ నియోజకవర్గాలలో చేసి తీరాల్సిందే అని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. ఇప్పటికి కూడా చేయకపోతే ప్రజాస్వామ్య మౌలిక సూత్రానికే అది విరుద్ధంగా ఉంటుందని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రతినిధి ఉంటారు. వారందరి సమస్యలను చట్ట సభలలో నివేదించి పరిష్కారాలను కనుగొంటారు. అయితే జనాభా అత్యధికమైనపుడు తన పరిధిని మించి ప్రజా సమూహం ఉన్నపుడు ఏ ఎంపీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు దేశంలో అత్యధిక లోక్ సభ సీట్లలో అదే రకమైన వాతావరణం ఉంది.
మూడింతలుగా పెరిగింది :
ఎపుడో 1971లో అప్పటి జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాలని ఏర్పాటు చేశారు. దాంతో ప్రతీ పది లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం అలా లభించింది. ఇది సహేతుకమైన లెక్కగా ఉంటూ వచ్చింది. అయితే 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలు నష్టపోకుండా సీట్ల పెంపుని పాతికేళ్ల పాటు ఫ్రీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత 2001లో అప్పటి ప్రధాని వాజ్ పేయి కూడా ఇదే విధానం అవలంబించి 2026 దాకా ఈ ఫ్రీజ్ ని కొనసాగించారు. దాంతో ఇపుడు కచ్చితంగా సీట్ల సంఖ్యను పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ యాభై అయిదేళ్ళ కాలంలో మూడింతలుగా దేశ జనాభా పెరిగింది అని గుర్తు చేస్తున్నారు.
జనాభా విస్పోటనంతో :
గతంలో అంటే 1971 నాటికి దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేది. ఇపుడు అది కాస్తా దాదాపుగా 150 కోట్లకు చేరువ అవుతోంది. ఈ లెక్కన చూస్తే దేశంలో ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలో సగటున జనాభా 27 లక్షల నుంచి 30 లక్షలుగా ఉంది అని అంటున్నారు. జనాభా నియంత్రణ సరిగ్గా అమలు చేయని ఉత్తరాది రాష్ట్రాలలో అధికంగా జనాభా పెరిగితే దక్షిణాది రాష్ట్రాలలో అయితే ప్రతీ లోక్ సభ పరిధిలో జనాభా 20 లక్షల పై దాటి ఉందని అంచనాలు ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సగటు జనాభాలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సగటున 25 నుండి 30 లక్షల వరకు జనాభా ఉంది. అదే దక్షిణాది రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటు జనాభా 17 నుండి 22 లక్షల మధ్యలో ఉంది. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు డీలిమిటేషన్ అవసరం అని అంటున్నారు.
ఎక్కడా లేని విధంగా :
ఇక చూస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ దిగువ సభలలో ఇంత పెద్ద సంఖ్యలో జనాభాతో పార్లమెంట్ సీట్లు లేవని గుర్తు చేస్తున్నారు. భారతదేశం లోక్‌సభ సీట్లు 543 అయితే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో సగటున 26.9 లక్షల జనాభా ఉంటుంది అన్న మాట. అదే అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 435 సీట్లు ఉంటాయి. అక్కడ ప్రతీ సీటులో జనాభ సగటున 7.8 నుంచి 7.9 లక్షలుగా ఉంటుంది. అదే విధంగా బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ లో సీట్లు 513 ఉంటే ఒక్క సీటులో 4.15 లక్షల జనాభా సగటున ఉంటుంది. యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ 650 సీట్లతో ఉంటే ఒక్కో సీటులో సగటున లక్ష జనాభా ఉంటుంది. ఇక ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టినా ఒక్కో లోక్ సభ సీటుకు సగటున 18 లక్షల మంది జనాభా ఉంటారు. అలా అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచడం అంటే 543 నుండి 816 లేదా 850 వరకు పెంచడం ద్వారా ఈ భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అందువల్ల అన్ని పార్టీలు డీలిమిటేషన్ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే ఉత్తమం అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.