డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం
| కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా రక్షణ కల్పించడం, 2051 వరకు సీట్ల నిష్పత్తిలో మార్పులు ఉండకపోవడం తమ మద్దతుకు కారణమని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగవచ్చన్నారు. డీఎంకే, వైసీపీ సహా మరికొన్ని పార్టీలు కూడా బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు కథనం పేర్కొంది.
దేశానికి డీలిమిటేషన్ మూడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే అతి పెద్ద చర్చగా అంతటా సాగుతోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ తమ ప్రజాస్వామ్య మౌలిక స్వరూప స్వభావాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా చేపడుతున్న డీలిమిటేషన్ బృహత్ ప్రక్రియ అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కోసం ఆ ప్రజల కోసం చేపడుతున్న డీలిమిటేషన్ తో ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతుంది అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇది కాలంతో పాటు సాగే సాధారణ సహజసిద్ధమైన మార్పుగానూ అనివార్యంగానూ రాజ్యాంగ హితమైన వ్యవహారంగానూ మేధావులతో పాటు నిపుణులు అంతా చూస్తున్నారు.
కలిసి వస్తున్న పార్టీలు :
సరిగ్గా ఆరేడు నెలల క్రితం డీలిమిటేషన్ బిల్లుని కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టినపుడు చాలా వరకూ ప్రతికూలత కనిపించింది. చివరికి అదే బిల్లు వీగిపోవడం ద్వారా వ్యక్తం అయింది. ఆనాడు కేంద్రం సరిగ్గా కసరత్తు చేయకుండా బిల్లుని ప్రవేశపెట్టిందా లేక వ్యూహాత్మకమా అన్నది పక్కన పెడితే నంబర్ గేం లో నాడు వీగిన డీలిమిటేషన్ బిల్లుకి ఇప్పుడు అన్ని విధాలుగా పరిస్థితులు కలిసి వస్తున్నాయని అంటున్నారు. దాంతో నాడు విముఖంగా ఉన్న పార్టీలు సైతం ఇపుడు సుముఖంగా మారుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లుకు ఓకే చెబుతున్నాయి.
బీఆర్ ఎస్ మద్దతు :
ఇదిలా ఉంటే తెలంగాణలో కీలక రాజకీయ పక్షం అయిన బీఆర్ఎస్ డీలిమిటేషన్ బిల్లుకు తన మద్దతు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాజ్యసభలో ఉన్న తమ ముగ్గురు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతుకు ప్రధాన కారణాలు చూస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటా తగ్గకుండా కాపాడాలనే తమ ప్రధాన డిమాండ్‌కు ఈ బిల్లులో రక్షణ కల్పించారని కేటీఆర్ తెలిపారు.
అలాగే 2051 సంవత్సరం వరకు రాష్ట్రాల మధ్య సీట్ల ప్రాతినిధ్య నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయకుండా నిబంధన పెట్టడం తమ ఆందోళనలను తొలగించిందని ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు విధానం అమలైతే, తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుంచి 26కు పెరుగుతుందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుందని కేటీఆర్ వివరించారు. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని దాని అమలుకు పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పడం విశేషం. బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్న బీఆర్ఎస్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం అనూహ్యమైనదిగా భావిస్తున్నారు.
ఇతర పార్టీల స్పందన :
ఇక కేంద్రం ఈ నెల 30న లోక్ సభలో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ ముసాయిదా బిల్లు విషయంలో అనేక పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే కూడా తాజా మార్పుల నేపథ్యంలో బిల్లుకు మద్దతు ప్రకటించింది. అలాగే ఎన్సీపీ, వైసీపీ వంటి పార్టీలు కూడా మద్దతు తెలుపుతునట్లుగా పేర్కొంటున్నారు. దీంతో సునాయాసంగానే డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని అంతా భావిస్తున్నారు.