తెలంగాణ నీళ్ల పంచాయితీలో కొత్త ట్విస్ట్.. తప్పు కేసీఆర్‌దా? కాంగ్రెస్‌దా?
| కృష్ణా జలాల వివాదంపై తెలంగాణలో రాజకీయ విమర్శలు పెరిగాయి. 2015లో కేసీఆర్ ప్రభుత్వం 299 టీఎంసీల వాటాకు అంగీకరించడం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు, పల్నాడు ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వానిదే పొరపాటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంగీకరించారు.
తెలంగాణలో కృష్ణా జలాల వివాదం మరోసారి రసవత్తరమైన రాజకీయ నాటకానికి తెరలేపింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీటి వాటాల కోసం పావులు కదుపుతుంటే.. మన నేతలు మాత్రం ఆ నీళ్లను ఎలా కాపాడుకోవాలనే దానికంటే ‘ఆ రోజు నువ్వు తప్పు చేశావ్’ అంటే.. ‘ఈ రోజు నువ్వు నిద్రపోతున్నావ్’ అంటూ ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ నీళ్ల పంచాయితీకి సరికొత్త మలుపునిచ్చాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు ఈ దుస్థితి పట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరోపించారు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటి వాటాకు సంతకాలు పెట్టి తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనం రాశారని సీఎం రేవంత్ ఈరోజు అచ్చంపేట సభలో విమర్శించారు. నాటి పాలకులు చేసిన ఆ చారిత్రక తప్పిదమే నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన వాదించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని గట్టిగా ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వ పనితీరుపైనే సంచలన వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు. పల్నాడు ప్రాజెక్టు విషయంలో పొరపాటు తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన బహిరంగంగా అంగీకరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా ప్రాంత అధికారులను కీలక స్థానాల్లో నియమించుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా పొరుగు రాష్ట్రం జలదోపిడీ కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నా తమకు కనీసం సమాచారం అందలేదని.. నాగార్జునసాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదని మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు సదరు అధికారికి ఫోన్ చేసి సెలవు పెట్టడం కాదని.. రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పినట్లు వెల్లడించారు.
ఈ రెండు పరిణామాలను బట్టి చూస్తే తెలంగాణ నీటి రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తోంది. ఒకవైపు పదేళ్ల క్రితం కేసీఆర్ చేసిన ఒప్పందం వల్లే నష్టం జరిగిందని సీఎం అంటుంటే.. మరోవైపు ఏడాదిగా మన కళ్లముందే ప్రాజెక్టు కడుతున్నా గుర్తించలేకపోయామని సొంత మంత్రే అంగీకరిస్తున్నారు. ఏడాది పాటు ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా ఇరిగేషన్ శాఖకు గానీ.. నిఘా వ్యవస్థకు గానీ తెలియకపోవడం వ్యవస్థాగత సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది. అధికారుల ప్రాంతీయ నేపథ్యం కంటే వారి పనితీరు.. జవాబుదారీతనంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తప్పు జరిగిపోయింది. అది కేసీఆర్ చేశాడో.. ఇప్పటి రేవంత్ ప్రభుత్వం ఆదమరిచి ఉందో.. అధికారుల తప్పిదమోకానీ ఇప్పటికైనా మేలుకోవాలి. గత ప్రభుత్వ తప్పిదాలపై చర్చించడంతో పాటు.. ప్రస్తుత పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుని, బలమైన న్యాయపోరాటం ద్వారా రాష్ట్ర వాటా నీటిని కాపాడుకోవడమే అసలైన పరిష్కారం.