కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పరిస్థితి ఏంటి? అసలు డిపాజిట్ అయినా దక్కుతుందా?
| తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన కల్వకుంట్ల కవితకు సంస్థాగత బలం, క్షేత్రస్థాయి క్యాడర్ నిర్మాణం కీలకంగా మారనున్నాయి. పాత టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ సెంటిమెంట్‌ను ఆకర్షించాలనే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్న చర్చ నడుస్తోంది. 2019లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కవితకు ఇప్పుడు సొంత పార్టీతో రాజకీయంగా నిలదొక్కుకోవడం, బలమైన నాయకులను సమీకరించడం ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి.
తెలంగాణలో అభ్యుదయ భావాలు ఎక్కువ.. ఎందుకంటే ఈ నేల నిజాంలు అణిచివేసిన గడ్డ.. కమ్యూనిస్టుల పోరుబాటకు పాదం కలిపిన ప్రాంతం.. అందుకే ఆ భావాలు, ఆవేశం.. పోరాటపటిమ కనిపిస్తుంటాయి.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలు పుట్టడం మనకు కొత్తేమీ కాదు. సీజన్ మారినప్పుడల్లా జెండాలు.. ఎజెండాలు మారుతుంటాయి. బీఆర్ఎస్‌తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ పేరిట ‘టీఆర్ఎస్’ వచ్చేలా కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. పేరులో పాత ‘టీఆర్ఎస్’ అక్షరాలు చూసి జనం పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారని.. సెంటిమెంట్ తన్నుకొచ్చి ఓట్ల వర్షం కురుస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ పాత సీసాలో కొత్త సారా పోసినంత మాత్రాన కిక్కు ఎక్కుతుందా? లేక కనీసం డిపాజిట్లు కూడా దక్కక రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నడుస్తోంది.
2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు రాష్ట్రమంతా ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఊగిపోయింది. అప్పట్లో ఉద్యమమే ఆయనకు బలమైన క్యాడర్‌ను నిర్మించి పెట్టింది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చి దశాబ్దం దాటింది. జనం ఆలోచనలు మారాయి.. ఇప్పుడు కావాల్సింది సెంటిమెంట్లు కాదు.. ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి. అలాంటప్పుడు కేవలం టీఆర్ఎస్ అనే మూడు అక్షరాలను పేరుకు తగిలించుకున్నంత మాత్రాన.. నాన్నగారి ఓటు బ్యాంకు కూతురి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుందనుకోవడం కొంచెం ఎక్కువ ఊహించుకోవడమే అవుతుంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అధికార కాంగ్రెస్, పదేళ్ల అనుభవం ఉన్న బీఆర్ఎస్... జాతీయ బలంతో దూసుకొస్తున్న బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ మూడు పార్టీలకు ప్రతి గ్రామంలోనూ బూత్ స్థాయి కార్యకర్తలు, జెండాలు మోసే బలమైన యంత్రాంగం ఉన్నాయి. మరి కవిత కొత్త పార్టీకి ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నికలంటే మైకులు పట్టుకుని ప్రసంగాలు చేయడం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. పోలింగ్ రోజు ఓటరును బూత్ దాకా తీసుకొచ్చే కార్యకర్త లేకుండా ఎన్నికల బరిలోకి దిగడం అంటే.. ట్యాంకులో పెట్రోల్ లేకుండా కారు రేసులో గెలవాలనుకోవడమే..
గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండి.. సకల సౌకర్యాలు ఉన్నప్పుడే నిజామాబాద్‌లో కవిత ఓటమిని చవిచూశారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని.. సొంత క్యాడర్‌ను నిర్మించుకుని గెలవడం అంటే మామూలు విషయం కాదు. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి రుద్రమ సేన అంటూ కొత్త వ్యూహాలు వేస్తున్నా.. అవి ఓట్లుగా మారతాయా అన్నది సందేహమే. కేటీఆర్, హరీశ్ రావులను విమర్శించడం ద్వారా మీడియాలో హెడ్‌లైన్స్ రావచ్చు కానీ.. ఆ విమర్శలు చూసి ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టరు కదా.. ఇదే ఆలోచించాలని విశ్లేషఖులు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో డిపాజిట్ దక్కాలంటే కనీసం ఆరో వంతు ఓట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కవిత పార్టీకి డిపాజిట్లు రావడం కూడా పెద్ద సవాలే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి ఇప్పుడే పూర్తిగా తీర్పు ఇవ్వలేం. అభ్యర్థుల ఎంపిక.. బలమైన నేతల రాక.. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే వ్యూహం.. స్థానిక సమీకరణాలపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
రాజకీయాల్లో ఇంటిపేరు వారసత్వంగా రావచ్చు కానీ.. ఓట్లు మాత్రం కష్టపడి సంపాదించుకోవాల్సిందే. లేదంటే ఈ కొత్త పార్టీ ప్రయాణం కూడా నాలుగు సభలు, పది ప్రకటనలతోనే ముగిసిపోయే ప్రమాదం ఉంది.