ఏఐ డాక్టర్.. ఏఐ పనిమనిషి.. ఏఐ బ్యాంక్ ఏజెంట్.. ఏఐ వాచ్‌మన్.. మరి ఏఐ ఎమ్మెల్యే/ఎంపీ ఉంటే పోలా..
| ఒకవైపు ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం పెరుగుతుండగా, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనతో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెంచే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ఉన్న ప్రజాప్రతినిధులే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కొత్త పదవుల కంటే జవాబుదారీతనం ముఖ్యమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నికైన ప్రతినిధులు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైద్య రంగంలో ఏఐ డాక్టర్.. బ్యాంకింగ్‌లో ఏఐ ఏజెంట్, ఇంటి పనులకు ఏఐ రోబోలు, భద్రతకు ఏఐ వాచ్‌మన్.. ఇలా ప్రతి రంగంలోనూ మనిషి అవసరాన్ని ఏఐ భర్తీ చేస్తోందని టెక్ నిపుణులతో పాటు స్వయంగా రాజకీయ నాయకులే వేదికలపై ఊదరగొడుతున్నారు. మరి ప్రజాసేవ విషయంలో మాత్రం ఈ టెక్నాలజీని ఎందుకు పూర్తిస్థాయిలో వాడుకోకూడదు? టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ కాలంలో సామాన్యుడి మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మారుతున్న ఈ ఏఐ యుగంలోనూ మన దగ్గర అసలు అప్‌డేట్ కాని ఒకే ఒక్క వ్యవస్థ ప్రజాప్రతినిధుల సంఖ్య. కనీస సమస్యలు పరిష్కరించే ఏఐ ఎమ్మెల్యేలు రారేమో కానీ.. పన్ను చెల్లింపుదారుల జేబులకు చిల్లు పెట్టే కొత్త కాన్వాయ్‌లు.. అదనపు పదవులు మాత్రం క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి.
ఒకవైపు పరిపాలనలో టెక్నాలజీని తీసుకొచ్చి ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తామని చెబుతూనే మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను పెంచే ప్రతిపాదనలు తెరపైకి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సామాన్య ప్రజలు.. పౌర సమాజం ఒకవైపు విమర్శలు గుప్పిస్తుంటే.. రాజ్యాంగ నిపుణులు.. రాజకీయ విశ్లేషకులు మరో కోణాన్ని వివరిస్తున్నారు.
సామాన్యుల అభిప్రాయం ప్రకారం.. ఉన్న ప్రజాప్రతినిధులే ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండటం లేదని.. రోడ్లు, డ్రైనేజీ, నిరుద్యోగం వంటి కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తమవుతోంది. ఒక ప్రజాప్రతినిధి పదవి వెనుక కేవలం జీతం మాత్రమే కాకుండా నాలుగైదు కార్ల కాన్వాయ్.. పది మంది సిబ్బంది, ప్రత్యేక కార్యాలయాలు, భద్రతా ఏర్పాట్లు వంటి భారీ ఖర్చులు ఉంటాయని పన్ను చెల్లింపుదారులు ఎత్తిచూపుతున్నారు.
ప్రజలకు కావాల్సింది వందల సంఖ్యలో కొత్త పదవులు కాదని.. ఉన్నవారిలో జవాబుదారీతనం.. పనితీరు మెరుగుపడటమేనని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సమస్యల పరిష్కారానికి ఏఐ ఎమ్మెల్యేనో, ఏఐ ఎంపీనో తీసుకొస్తే.. కనీసం కాన్వాయ్ ఖర్చులైనా మిగులుతాయని ఫోన్‌లోనే ఫిర్యాదులు పరిష్కారమవుతాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి పౌరుడికి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఏఐ కేవలం డేటాను విశ్లేషించి పరిపాలనలో సహాయపడగలదు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున చట్టసభల్లో గళమెత్తడానికి.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి.. ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తప్పనిసరి అని ప్రజాప్రతినిధులు తమ గళాన్ని వినిపిస్తున్నారు.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ప్రజాస్వామ్యంలో మానవీయ కోణాన్ని యంత్రాలు భర్తీ చేయలేవు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని వేగంగా స్పందించకపోతే భవిష్యత్తులో ప్రజల నుంచి ఇలాంటి సెటైర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.