కరోనా కంటే భయంకరమైన ఉపద్రవం రాబోతోందా?
| ప్రముఖ ఏఐ నిపుణుడు నికోలా 2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచం కరోనా కంటే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే పదేళ్లలో పలు రంగాల్లో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల కోసం రెండు వారాలకు సరిపడా ఆహారం, నగదు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
మన కళ్లముందే ప్రపంచం కుప్పకూలిన ఆ చీకటి రోజులను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. కొవిడ్-19 మహమ్మారి మిగిల్చిన విషాదం.. ఆర్థిక సంక్షోభం.. ఆత్మీయులను కోల్పోయిన వేదన నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఊపిరి పీల్చుకునే లోపే.. అంతకంటే భయంకరమైన మరో పెను విపత్తు మన తలుపు తట్టబోతోందా? కంటికి కనిపించని వైరస్ కంటే మనమే సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మానవ ఉనికికే పెను సవాలుగా మారనుందా? తాజాగా ప్రముఖ ఏఐ నిపుణుడు నికోలా చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
నిన్నటి వరకు మనిషికి సహాయకారిగా ఉన్న టెక్నాలజీ.. రేపు మనల్ని శాసించే స్థాయికి చేరుకుంటోంది. విద్య, వైద్యం, సాఫ్ట్‌వేర్, మీడియా.. ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. గంటల తరబడి శ్రమిస్తే గానీ పూర్తికాని పనులను నిమిషాల్లో చక్కబెడుతూ అద్భుతాలు చేస్తోంది. అయితే ఈ అసాధారణ వేగమే రాబోయే పెను విధ్వంసానికి సంకేతమని నికోలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 నాటికి కృత్రిమ మేధస్సు కారణంగా ప్రపంచం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఆ పరిస్థితులు కరోనా కాలం కంటే దారుణంగా ఉండవచ్చని ఆయన హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సాంకేతిక విప్లవంలో అత్యంత భయానకమైన అంశం నిరుద్యోగం. రాబోయే పదేళ్లలో ఉద్యోగ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్, అకౌంటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో మనుషుల స్థానంలో యంత్రాలు కొలువుదీరనున్నాయి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోలేని సామాన్యుడికి ఉపాధి కరువై జీవితాలు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు 2030 నాటికి ఏఐ వ్యవస్థలు మనిషి నియంత్రణ దాటి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటాయన్న అంచనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
నికోలా హెచ్చరికల్లో అత్యంత కీలకమైనది ముందస్తు జాగ్రత్త.. ఏదైనా భారీ సాంకేతిక , ఆర్థిక సంక్షోభం తలెత్తితే సరఫరా వ్యవస్థలు స్తంభించిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ముందుజాగ్రత్తగా కనీసం రెండు వారాలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని.. అత్యవసర పరిస్థితుల కోసం చేతిలో కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ అభివృద్ధికి పూర్తిగా బ్రేకులు వేయడం అసాధ్యం.. కానీ దానికి కఠినమైన నియంత్రణలు.. భద్రతా ప్రమాణాలు విధించడం తక్షణ అవసరం. ప్రభుత్వాలు, టెక్ దిగ్గజాలు మేల్కొని మానవ పర్యవేక్షణకు పెద్దపీట వేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ.. టెక్నాలజీకి బానిసలు కాకుండా దాన్ని నియంత్రించే శక్తిగా ఎదగడమే మన ముందున్న ఏకైక మార్గం.