తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం
| ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు జనసేనలో ఆత్మపరిశీలనకు దారితీశాయి. దాదాపు 4 వేల పంచాయతీల్లో జనసేన మద్దతుదారులకు 189 స్థానాలే దక్కాయని కథనం పేర్కొంది. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం, గ్రామస్థాయి క్యాడర్ బలహీనత, టీడీపీతో పోటీ వంటి అంశాలు వెనుకబాటుకు కారణాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండో, మూడో విడతల్లోనైనా జనసేన పుంజుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
జనసేనకు ఒక విధంగా పంచాయతీ ఎన్నికలు ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చాయా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే తొలి విడతలో దాదాపుగా నాలుగు వేల పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో జనసేన సొంతంగా దక్కించుకునది 189 సీట్లు మాత్రమే. అంటే మొత్తంగా చూస్తే 5 శాతం మాత్రమే సీటు షేర్ దక్కించుకుంది. మరి ఇంతలా తేడా ఎక్కడ కొట్టింది అన్నది ప్రస్తుతం జనసేనలో అంతర్మధనం సాగుతోంది. విశ్లేషించి చూస్తే జనసేనకు పట్టున్న చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇంకా చెప్పాలంటే పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వంటి నియోజకవర్గాలలో కూడా ఆశించిన స్థాయిలో జనసేన అయితే రాజకీయ ప్రదర్శన చేయలేకపోయింది అని అంటున్నారు.
పవన్ చేతిలోనే అంతా :
ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఎంతో అభివృద్ధి గడచిన రెండున్నరేళ్ళ కాలంలో పంచాయతీల్లో చూపించారు. గ్రామాలకు నిధులు తీసుకుని రావడం ద్వారా అభివృద్ధి పరచారు. మరి వాటి ఫలితాలు పంచాయతీ ఎన్నికల్లో కనిపించాలి కదా అన్నదే చర్చగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఎక్కువ సర్పంచ్ పదవులు జనసేనకు ఎందుకు రాలేదు అని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే తొలి విడతగా వచ్చిన పంచాయతీ ఫలితాల్లో టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. అదే సమయంలో జనసేన మద్దతుదారులు అయితే సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు. ఉదాహరణగా చూస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 215 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే టీడీపీ మద్దతుదారులు 58 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థులు కేవలం 12 స్థానాలకే పరిమితమవడం విశేషం. ఇదొక్కటే కాదు, ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించడంతోనే జనసేన తల్లడిల్లుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
లేట్ చేసిన ఫలితమా :
పవన్ కళ్యాణ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి దశలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీకు బలం ఉన్న చోట పోటీ చేయండి అని జన సైనికులకు సూచించారు. అయితే ఆ ఆలస్యమే వ్యూహాత్మక తప్పిదంగా ఎత్తి చూపిస్తున్నారు. ఇక చూస్తే మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పట్ల జనసేన క్యాడర్‌లో కొంత అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ ముద్ర లేని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అధికారికంగా సీట్ల పంపకాలు ఏవీ జరగలేదు. దీంతో తమ కార్యకర్తలు స్వతంత్రంగా పోటీ చేసుకోవచ్చునని వారిని అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ నవంబర్ 22న పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే పుణ్య కాలం మించిపోయింది అని అంటున్నారు. దాంతో జనసేన కార్యకర్తలు వేలాది పంచాయతీలలో అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాన్ని తాముగా కోల్పోయారన్నది ఒక విశ్లేషణగా ఉంది.
ఆషామాషీ కాదు :
ఇక మునిసిపల్, పరిషత్తు ఎన్నికలు వేరు, అక్కడ పార్టీ గుర్తు ఉంది, కూటమి పొత్తుల అండ ఉంది. కానీ పంచాయతీలకు వచ్చేసరికి పూర్తిగా సొంత వ్యవహారంగానే చూడాలి. పైగా సంస్థాగత బలం ఉండాలి. బలమైన క్యాడర్ తో పాటు ఆర్ధిక వననులు దండీగా ఉండాలి, జనసేనకు అవి కొరత కావడంతోనే ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని అంటున్నారు. అంతే కాదు అభ్యర్ధుల సొంత ఇమేజ్, సామాజిక సమీకరణలు అనుబంధాలు అనుభవాలు ఇవన్నీ అక్కడ వర్కౌట్ అవుతాయి. అందుకే జనసేన తేలిపోయింది అన్నది కూడా మరో విశ్లేషణగా ఉంది. ఇక చూస్తే గ్రామీణ స్థాయిలో టీడీపీ, వైసీపీలకు ఉన్నట్లుగా దశాబ్దాల నాటి బూత్ స్థాయి నెట్‌వర్క్ అలాగే ప్రతి ఊరిలో పోటీ చేయగల ఆర్థిక బలం ఉన్న నాయకత్వం ఇంకా జనసేనకు పూర్తిస్థాయిలో లేదన్నది మరో కఠిన నిజంగా చెబుతున్నారు.
కట్టుబడిపోయారు :
ఇక టీడీపీకి గ్రామాలలో మంచి పట్టు ఉంది. సహజంగానే ఆధిపత్యం చూపిస్తారు. జనసేన విషయం అయితే సొంతంగా పోటీ మీద అయోమయం నెలకొనడంతో ఎటూ కూటమి ధర్మం అన్న దానికి కట్టుబడిపోయారు అని అంటున్నారు. టీడీపీ మద్దతుదార్లు వెనక్కి తగ్గకపోవడంతో కూడా జనసేన ఎందుకొచ్చిన వివాదాలు అని తప్పుకుందని అంటున్నారు. మరో వైపు పోటీ చేసిన చోట్ల కూడా పవన్ చరిష్మాను వాడుకోవడంలో విఫలం అయ్యారని, అలాగే ఆయన చేసిన అభివృద్ధిని జనాలకు తెలియచెప్పడంలో కూడా వెనకబడ్డారని అంటున్నారు.
ట్రోల్స్ అంటూ బెంగ :
ఇక జనసేన పంచాయతీలలో ఇలా వెనకబడడంతో విపక్ష వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తుందేమో అన్న బెంగ భయం అయితే జనసైనికుల్లో ఉందని అంటున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలో జనసేన 21 సీట్లు గెలవడానికి టీడీపీ ఓటు బదిలీయే ప్రధాన కారణమని గతంలోనే టీడీపీ సోషల్ మీడియా వర్గాలు వాదించాయని గుర్తు చేస్తున్నారు. ఇపుడు చూస్తే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు వేలాది స్థానాల్లో గెలిచి ఉన్నారు. అదే సమయంలో జనసేన సింగిల్ డిజిట్ లేదా రెండంకెల స్థానాలకే పరిమితం కావడంతో పల్లె సీమలలో జనసేనకు సొంత బలం లేదని ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారని జనసైనికులలో గుబులు రేగుతోంది అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ :
ఇక తమకు బలం పెరిగింది అని ఎక్కువ సీట్లు ఇవ్వాలని వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో బేరసారాలు ఆడే శక్తి కూడా ఈ పేలవమైన ఫలితాలతో తగ్గుతుందనే ఆందోళన కూడా జనసేనలో ఉంది అని అంటున్నారు. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు క్షేత్రస్థాయి బలం తక్కువగా ఉందని తేలితే కనుక భవిష్యత్తులో జరిగే నామినేటెడ్ పదవుల పంపకాలు విషయం కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ 2029 అసెంబ్లీ సీట్ల సర్దుబాటులో జనసేనకు ప్రాధాన్యత తగ్గిస్తారేమో అనే కలవరం కూడా జనసైనికుల్లో వ్యక్తమవుతోంది అంటున్నారు. అంతే కాదు మరో వైపు విపక్ష వైసీపీ కాచుకుని కూర్చుంది అని అంటున్నారు. ఆ పార్టీకి కోరి అస్త్రం అందించినట్లుగా ఉందని కూడా మధన పడుతున్నారు. ఇక వైసీపీ చూస్తే ఇంచార్జ్‌ల అండ లేకపోయినా తమ మద్దతుదారులు వందలాది పంచాయతీల్లో గెలిచారని శ్రేణులు ప్రచారం చేసుకుంటున్న నేపధ్య ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీకి కనీస స్థానాలు రాలేదని విపక్ష వైసీపీ గట్టిగా ఎద్దేవా చేసే అవకాశం ఏర్పడిందని అంటున్నారు.
జనసేన పుంజుకుంటుందా :
ఇక మొదటి విడతలో ఈ తడబాట్లు పొరపాట్లు పక్కన పెడితే ఈ నెల 29న జరిగే రెండో విడత డిసెంబర్ 2న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనైనా జనసేన పుంజుకుంటుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఇక తమ సత్తా చాటాలని జనసేన శ్రేణులు భావిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పవన్ కళ్యాణ్ సొంత సీటు పిఠాపురం, అలాగే ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గాల్లో జనసేన మద్దతుదారులు చెప్పుకోదగ్గ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను మిగిలిన విడతల్లో దక్కించుకుంటేనే అటు విపక్షాల విమర్శలకు, ఇటు మిత్రపక్ష సోషల్ మీడియా ప్రచారాలకు చెక్ పెట్టగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.