సినిమా డైలాగులు వేరు.. అసలు రాజకీయం వేరు సీఎం విజయ్..
| తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపారనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. పార్టీ ఎమ్మెల్యే వివాదంతో సీఎం విజయ్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తామని.. ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెరతీస్తామని అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చిన దళపతి సీఎం విజయ్‌కు.. సొంత పార్టీ నేతలే ఊహించని షాకులు ఇస్తున్నారు. కళ్లకురిచ్చి జిల్లా మహిళా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలతో టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
వెండితెరపై విలన్ల భరతం పడుతూ.. మహిళల రక్షణపై పవర్‌ఫుల్ డైలాగులు చెప్పే విజయ్.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యవహారంతో ఇరకాటంలో పడ్డారని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా జిల్లా కలెక్టర్‌కే అసభ్య సందేశాలు పంపడం.. ఆపై మహిళల వేధింపుల చట్టంలోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదై కటకటాల పాలుకావడం పార్టీ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే అంశంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఇంతటి క్రమశిక్షణ చూపిస్తుంటే.. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని ప్రత్యర్థి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి.
ఈ వ్యవహారంలో సీఎం విజయ్ ఎమ్మెల్యేపైన చర్యలకు ఆచితూచి స్పందించారు. ఇదే ఆయనకు పెద్ద మైనస్ అయ్యింది. సినిమా డైలాగులు వేరు.. రాజకీయం వేరు అని అర్థమైపోయింది. వేగంగా స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే పరువు దక్కేది. కానీ ఇప్పుడు కేవలం పోలీస్ స్టేషన్‌తోనే ఆగిపోలేదు. అన్నాడీఎంకే న్యాయవాది ఒకరు మద్రాస్ హైకోర్టు తలుపు తట్టడంతో కేసు మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. ఈ దర్యాప్తును ఏకంగా ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఈ వ్యవహారాన్ని సాదాసీదాగా పక్కన పెట్టే అవకాశం లేకుండా పోయింది.
అభిమానుల ఈలలు, చప్పట్లను ఓట్లుగా మార్చుకోవడం ఒక ఎత్తయితే గెలిచిన నేతలను అదుపులో పెట్టుకోవడం మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదంపై విజయ్ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై పార్టీ పరంగా వేటు వేసి.. బాధిత అధికారిణికి అండగా నిలుస్తారా? లేక రాజకీయ కక్ష సాధింపు అంటూ పాత పాటే పాడుతారా? తటస్థ ఓటర్లలో పార్టీ పట్ల ఏర్పడుతున్న ప్రతికూల అభిప్రాయాన్ని విజయ్ ఎలా చెరిపివేస్తారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..
సినీ గ్లామర్‌తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన విజయ్‌కు.. కళ్లకురిచ్చి ఎపిసోడ్ ఒక గట్టి హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు. పార్టీలో క్రమశిక్షణ కొరవడితే ప్రత్యర్థులు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే సొంత నేతలే పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఇలా వాటిల్లుతుంది.