సీట్లు పెరిగితే ఏపీలో అధికారానికి ఆ రెండు రీజియన్స్ కీలకం !
| డీలిమిటేషన్‌తో ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరగవచ్చనే అంచనాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 132కు, ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్య 27కు చేరుతుందని కథనంలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 102 సీట్లు, కృష్ణా–గుంటూరులో 49 స్థానాలు కీలకంగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.
డీలిమిటేషన్ తో ఏపీలో పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. దేశం సంగతి పక్కన పెడితే ఏపీ రాజకీయాల మీద ఇప్పుడు చర్చ అంతా సాగుతోంది. ఎందుకంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఏపీ పాలిటిక్స్ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల స్థాయి దాటి మరీ సాగే ఈ రాజకీయ భీకర సమయం మీద దేశమంతా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఏపీకి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఒక ఎన్నికలో ఒక పార్టీని గెలిపించిన జనాలు మరో ఎన్నికల్లో ఇంకో పార్టీని గెలిపిస్తూ వస్తూంటాయి. ఇలా చూస్తే విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇదే సాగింది. ఈ లెక్కన 2029 లో విజయం మాదే అని వైసీపీ ధీమా పడుతోంది. ఆ ట్రాక్ రికార్డ్ ని రివర్స్ చేయాలని కూటమి పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో డీలిమిటేషన్ వల్ల పెరిగే సీట్లు ఏపీ రాజకీయాన్ని మార్చేసేలా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని సీట్లు :
ఇక డీలిమిటేషన్ బిల్లులో ఆసెంబ్లీలలో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో యాభై సీట్లు పెంచుతారని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో ఇప్పుడు ఉన్న 175 సీట్లు ఒక్కసారిగా పెరిగి 263 గా బిగ్ నంబర్ అవుతుంది. అయితే ఏ జిల్లాలో సీట్లు ఎంత పెరుగుతాయన్నది చూస్తే అంచనా వివరాలు చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇందులో కొన్ని జిల్లాలలో ఉన్న ఎక్కువ సీట్లు మరింతగా పెరిగి ఏపీ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు అని అంటున్నారు.
జిల్లాల వారీగా లెక్క :
ఇక చూసే కనుక పాత ఉమ్మడి జిల్లాల ప్రకారంగా అనంతపురం జిల్లాలో 14 స్థానాలు 21 స్థానాలు కానున్నాయి. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు 21 స్థానాలు కానున్నాయి. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు 15కు, చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు 21కి, నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు 15కు, ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు 18కి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు 25కు, కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు 24కు, తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు 28 కి, పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు 22 కు పెరగనున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు 23 కు విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు 15 కు శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు 15కు పెరగనున్నాయి. ఇలా ఏపీలో 88 అదనంగా ఎమ్మెల్యే సీట్లు రానున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ ఇదే :
ఇక మరో ముఖ్య విషయం ఏంటి అంటే ఏపీలో ప్రస్తుతం అధికారం అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 88గా ఉంది. అదే 263 సీట్లు అయ్యాక అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 132 అవుతుంది అని అంటున్నారు. అంటే ఏ పార్టీ అయినా కంఫర్టబుల్ మెజారిటీ సాధించాలంటే ఈ నంబర్ అవసరం అన్న మాట. ఇక ఇప్పటిదాకా చూస్తే ఏపీలో విపక్ష హోదా దక్కాలీ అంటే 18 సీట్లు రావాల్సి ఉంది. కానీ కొత్తగా సీట్లు పెరిగితే మాత్రం ఈ నంబర్ 27 కి చేరుకుంటుంది. అన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించరన్న మాట.
ఆ రెండు రీజియన్లు చాలు :
మరో ముఖ్య విషయం ఇక్కడ ఉంది. ఏపీలో అధికారం మారేది ఎప్పుడూ ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల మీదనే ఆధారపడి అన్నది తెలిసిందే. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే ఈ రెండు రీజియనల్లో చెరి 34 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 68 సీట్లు అన్న మాట. వాటిని దక్కించుకున్న వారికే అధికారం చేరువ అవుతుంది. ఇపుడు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. ఈ రెండు రీజియనల్లో కొత్తగా పెరిగే సీట్లతో చెరి 51 సీట్లుగా మారి మొత్తం 102 సీట్లు అవుతాయన్న మాట. దీంతో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ ఆధిక్యత దక్కుతుందో వారే అధికారంలోకి సులువుగా వచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో పునర్ విభజన తరువాత 49 సీట్లు అవుతాయి. అంటే ఈ వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా ముఖ్య భూమిక పోషిస్తాయన్న మాట. మరి ఏపీలో వైసీపీ కూటమిలలో ఈ రీజియన్లలో ఎవరికి ఎంత పట్టు ఉంది, ఎంత ఆధిక్యం చూపిస్తాయన్న దాని మీదనే ఏపీ రాజకీయం ఆధారపడి ఉందని అంటున్నారు.