ఈవీ వాహన ఉత్పత్తిపై మోడీ సర్కారు అదిరే పాలసీ

గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం.. వాటిపై ప్రజల్లో మోజు పెరుగుతోంది. దీనికి తగ్గట్లే వాహనాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.;

Update: 2025-06-03 07:30 GMT

గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం.. వాటిపై ప్రజల్లో మోజు పెరుగుతోంది. దీనికి తగ్గట్లే వాహనాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళ.. ఈవీ వాహనాల్ని దేశీయంగా తయారీ చేసే కంపెనీలకు భారీ నజరానాల్ని ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈవీ వాహనాల ఉత్పత్తి కోసం పెట్టుబడే సైజుకు తగ్గట్లు సుంకాల నుంచి రిలీఫ్ ఇస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈవీ పాలసీ మార్గదర్శకాలను నోటిఫై చేసింది.

ప్రస్తుతం ఈవీ వాహనాల దిగుమతిపై 70 - 100 శాతం వరకు సుంకాల్ని విధిస్తున్నారు. అయితే.. తాజా పాలసీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఈవీ పాలసీలో ఫోర్ వీలర్ వాహనాల తయారీ కోసం రూ.4150 కోట్లు పెట్టుబడిగా పెడితే.. దాదాపు 8వేల వరకు వాహనాలకు అత్యంత తక్కువగా 15 శాతం సుంకాలతో దిగుమతి చేసుకునే వీలు కల్పిస్తారు. ఈ సుంకాల మినహాయింపు గరిష్ఠంగా ర.6484 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు.

కాకుంటే దీనికి ఒక కండీషన్ ఉంది. అదేమంటే.. ఈవీ వాహనాల ఉత్పత్తికి అనుమతి పొందిన సంస్థలు మూడేళ్లలోపు తయారీ ప్లాంట్ల కార్యకలాపాల్ని ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని తాజాగా ప్రకటించారు. ఈ పాలసీకి సానుకూలంగా స్పందిస్తూ అప్లికేషన్ పెట్టుకునే కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం 120 రోజుల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్లాంట్ ఏర్పాటు.. యంత్ర పరికరాలు మొదలైన వ్యయాలకు స్కీం కింద పెట్టుబడుల ఆధారిత ప్రయోజనాలు లభిస్తాయి.. భూమిని సమీకరించేందుకు చేసే ఖర్చును మాత్రం వ్యయం కింద పరిగణలోకి తీసుకోరు.

అయితే.. ఈ ప్రయోజనాలు ఆటోమోటివ్ తయారీకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో రూ.10వేలకోట్ల ఆదాయం ఉన్న గ్రూపులకు మాత్రమే ఈ స్కీంను వర్తించేలా చేస్తారు. కార్ల తయారీకి సంబంధించి తొలి మూడేళ్లలో దేశీయంగా జోడించే అదనపు విలువ కనీసం 25 శాతం ఉండాలని.. ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుందన్న కండీషన్ పెట్టారు. చార్జింగ్ మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాలను కూడా పెట్టుబడిగా పరిగణిస్తారు. అంటే.. భారత్ లో ఈవీ కార్ల ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రకటించిన ఈ రాయితీలు.. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే వీలుంది. మరి.. భారత్ లో ఈవీ కార్ల ఉత్పత్తి కోసం ఏయే కంపెనీలు ముందుకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News