ట్రంప్ కు మోడీ కౌంటర్ .. దెబ్బ అదిరిపోలా..

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీ వెనుకడుగు వేయకుండా ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసింది.;

Update: 2025-08-28 10:55 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు టారిఫ్‌లతో భారత ఎగుమతులపై గట్టి ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి విభాగాల్లో ఇది తక్షణ ప్ర‌భావాన్ని చూపనుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీ వెనుకడుగు వేయకుండా ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసింది.

- 40 దేశాల్లో మార్కెట్ విస్తరణ లక్ష్యం

కేంద్రం రూపొందించిన కొత్త కార్యాచరణలో భాగంగా యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా భారత ఉత్పత్తులకు ఆ దేశాల్లో మరింత మార్కెట్ దక్కేలా చర్యలు చేపడతారు.

కేంద్రానికి చెందిన ఓ అధికారి ప్రకారం “నాణ్యత, సుస్థిరతలో భారత్‌ నమ్మకమైన సరఫరాదారుగా నిలవాలి. కొత్త తరహా టెక్స్‌టైల్ ఉత్పత్తులతో గ్లోబల్ మార్కెట్‌లో ప్రధాన పాత్ర పోషించాలన్నదే ఈ కార్యాచరణ వెనుక ఉద్దేశ్యం” అని తెలిపారు.

- మార్కెట్ మ్యాపింగ్, బ్రాండ్ ఇండియా విజన్

ప్రతిపాదిత ప్రోగ్రామ్‌లలో మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్‌, పానిపట్‌, తిరుపూర్‌, బదోహి వంటి ప్రధాన వస్త్ర పరిశ్రమ కేంద్రాల ఉత్పత్తులను విదేశాల్లో ప్రోత్సహించడం ప్రధానాంశాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, కొనుగోలు-విక్రయదారుల సమావేశాలు, ‘యునిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్‌’ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ప్రస్తుతం భారత్ 220 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఈ 40 దేశాలు కీలకమైనవిగా భావిస్తున్నారు. ఏటా 590 బిలియన్ డాలర్లకు పైగా విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులను ఇవి దిగుమతి చేసుకుంటున్నాయి. అందువల్ల ఈ దేశాల్లో మార్కెట్ షేర్ పెంచుకోవడం ద్వారా భారత్‌కు విస్తృత అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- పత్తి దిగుమతి సుంకం మినహాయింపు పొడిగింపు

మరోవైపు, వస్త్ర పరిశ్రమకు ఊరట కల్పించేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై సుంక మినహాయింపును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇంతకుముందు 11 శాతం పన్ను ఉండగా, ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం, తాజాగా ఆ గడువును మరింత పొడిగించింది.

ట్రంప్ టారిఫ్‌లతో ఎదురవుతున్న సమస్యను భారత్ వెనుకడుగు వేయకుండా అవకాశంగా మలుచుకుంటున్నది. కొత్త మార్కెట్లలో స్థిరపడటంతో పాటు, వస్త్ర పరిశ్రమకు ఊరట చర్యలు తీసుకోవడం ద్వారా న్యూఢిల్లీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లే. అమెరికా ఒత్తిడి మధ్య భారత్ తన ఎగుమతి వ్యూహాన్ని మరింత బలపరచాలని నిర్ణయించుకుంది.

Tags:    

Similar News