భారత్ ఖర్చు శక్తి చూసి షాక్ అవుతున్న ఎన్ఆర్ఐలు!

ఈ అనుభవాలన్నీ భారతదేశం ఒక భారీ వినియోగదారుల మార్కెట్‌గా ఎలా మారిందో స్పష్టం చేస్తున్నాయి.;

Update: 2025-08-17 18:30 GMT

భారతదేశం ఒకప్పుడు పేద దేశం అనే భావనతో చాలామంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి తమ అవసరాలు తీర్చుకునే వారు.. కానీ ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు వారి అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడు అన్నీ చవకగా దొరకవు. కొన్నిసార్లు, వారు జీవిస్తున్న పాశ్చాత్య దేశాల కంటే ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటోంది. ప్రజల ఖర్చు శక్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మార్పును వివరించేందుకు పలువురి అనుభవాలను ఇక్కడ పంచుకుందాం.

దుబాయ్‌కి చెందిన వ్లాగర్‌ పరక్షిత్ బలోచి తన సోషల్ మీడియా పోస్ట్‌లో "భారతదేశంలో ఒక కప్పు టీకి వెయ్యి రూపాయలు చెల్లించాను" అని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఒక అతిశయోక్తి అయినప్పటికీ భారతదేశంలో లైఫ్‌స్టైల్‌ ఎంపికల వైవిధ్యాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ రూ.10కి టీ తాగవచ్చు, ఫైవ్‌స్టార్‌ హోటల్లో రూ.1000కి కూడా తాగవచ్చు. ఈ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.

- మారిన కొనుగోలు తీరు

టొరంటోలో నివసిస్తున్న కల్పన తన అనుభవాన్ని పంచుకుంది. 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లో చీరల షాపుకు వెళ్లినప్పుడు, తాను రూ.22,000 చీర కొనుగోలు చేయడానికి చాలా ఖరీదని భావించింది. అయితే ఆమె పక్కన ఉన్న మధ్యవయస్కులైన ఇద్దరు మహిళలు ఒక్కొక్కరు రూ.56,000 విలువ చేసే రెండు చీరలు కొనుగోలు చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. దుకాణంలో సేల్స్‌మన్‌ "ఇది మాకు సాధారణమే" అని చెప్పడంతో 15 ఏళ్ల క్రితం తాను ధనవంతురాలిగా భావించుకున్నా, ఇప్పుడు ఇక్కడ మధ్యతరగతి స్థాయిలో ఉన్నట్లు తనకు అనిపించిందని కల్పనా చెప్పింది. ఈ మార్పు తనకు గర్వకారణంగా ఉందని కూడా ఆమె పేర్కొంది.

- గ్లోబల్ లైఫ్‌స్టైల్, లోకల్ రేట్లు

అమెరికాలో నివసిస్తున్న అవినాష్ చతుర్వేది ముంబైలోని ఒక రెస్టోబార్‌లో ఇద్దరికోసం రెండు డ్రింక్స్‌, రెండు వెజ్ స్నాక్స్‌కు రూ.9,500 బిల్లు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ఖర్చులు న్యూయార్క్‌లో కూడా సాధారణమేనని, భారతదేశంలో కూడా అమెరికా స్థాయి లైఫ్‌స్టైల్ ప్రజలకు అందుబాటులో ఉందని అతను చెప్పాడు. ఇదే విషయాన్ని బిజినెస్‌మన్‌ రంగనాథ్ కూడా ధ్రువీకరించాడు. భారతీయ మల్టీప్లెక్స్‌లలో సినిమాకు వెళ్లే కుటుంబాలు పాప్‌కార్న్, కోల్డ్‌డ్రింక్స్‌ కోసం రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఖర్చు చేస్తున్నారని, ఇది అమెరికా రేట్లకు సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఇంత ఖరీదైనా మల్టీప్లెక్స్‌ల వద్ద క్యూలు పెద్దవిగా ఉంటాయని చెప్పి, ఇక్కడి ప్రజల ఖర్చు చేసే విధానం ప్రపంచానికి షాక్‌నిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

- బలమైన వినియోగదారుల మార్కెట్

ఈ అనుభవాలన్నీ భారతదేశం ఒక భారీ వినియోగదారుల మార్కెట్‌గా ఎలా మారిందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నారైలు, విదేశీయులు భారతదేశాన్ని ఇకపై చవకైన గమ్యస్థానంగా చూడలేరు. ఇక్కడి ప్రజలు తమ లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచుకోవడానికి, నాణ్యమైన వస్తువులు, సేవలకు వెచ్చించడానికి వెనుకాడటం లేదు. ఈ పరిణామం విదేశీ వ్యాపారాలకు, ముఖ్యంగా అమెరికా వంటి దేశాలకు ఒక స్పష్టమైన సంకేతం. భారతదేశం ఒక చిన్న కస్టమర్ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. దీనితో వ్యాపార సంబంధాలు ఈ బలమైన మార్కెట్‌ను గౌరవించేలా ఉండాలి. ఎందుకంటే భారతదేశంపై టారిఫ్‌లు పెడితే నష్టపోయేది అమెరికా లాంటి దేశాలే. భారతదేశం ఆర్థికంగా, వినియోగపరంగా సాధిస్తున్న పురోగతిని ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    

Similar News