బస్సు ఎక్కితే లైఫ్ క్లోజేనా... ఈ డేటా చూస్తే పరేషాన్

ఇక ఈ మధ్యనే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కనీ ఒక మాట అన్నారు. రహదారులు బాగులేవు అంటే తనని ఎవరూ తిట్టుకోవద్దని బాధ్యుల మీద కూడా ఫోకస్ పెట్టాలని అన్నారు.;

Update: 2025-11-03 07:51 GMT

బస్సు ఎక్కాలంటే భయంగా ఉంది. బస్సు క్షేమంగా గమ్యం చేరుస్తుంది అన్న నమ్మకం అయితే లేదు, అది ప్రభుత్వ బస్సు అయినా లేక ప్రైవేట్ బస్సు అయినా సేఫ్ అన్న మాట లేదా అంటే జనాలు మాత్రం భయానికే లోను అవుతున్నారు. అసలు ఈ బస్సులకు ఏమైంది అన్న చర్చ వస్తోంది. బస్సులు ఎవరైనా ఎక్కేది తమ ప్రాంతాలకు చేరుకోవాలని. కానీ టికెట్ పట్టుకుని ఏకంగా పరలోకాలను చేరడం కోసం కాదు కదా అంటున్నారు. అంతే కాదు దారుణమైన మరణాన్ని పొందుతూ ఎక్కడో కానని చోట చావుని కొని తెచ్చుకుంటున్న వారిని చూస్తే బస్సు అంటే బాబోయ్ అనాల్సి వస్తోంది.

వారం పది రోజుల్లో :

ఒక్కసారి చూస్తే దేశంలో గడచిన వారం పది రోజులలో బస్సు ప్రమాదాల వల్ల అరవై నుంచి డెబ్బై మంది దాకా చనిపోయారు అంటే ఈ బస్సులు యమ శకటాలుగా మారిపోతున్నాయా అని అంతా అంటున్న నేపథ్యం ఉంది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగినబస్సు ప్రమాదం ఘోరంగా ఉంది. ఇది ఏకంగా జాతీయ స్థాయిలో మీడియాను బలంగా తాకింది. అతి పెద్ద చర్చకు తెర తీసింది. ఈ బస్సు ప్రమాదంలో ఏకంగా 21 మంది దాకా మరణించారు అన్నది తాజా వార్తలు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ఈ బస్సుని ఎదురుగా వస్తున్న కంకర రాయిని తీసుకుని వెళ్ళే టిప్పర్ బలంగా ఢీ కొనడంతోనే భారీ ప్రమాదం చోటు చేసుకుంది అని అంటున్నారు. ఈ ప్రమాదం విజువల్స్ చూస్తే ఎంత ఘోరం జరిగింది అన్నది అర్థం అవుతోంది. వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు.

నిన్నటికి నిన్న :

ఇక నిన్నటికి నిన్న రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలోని మథోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మరణించారు. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు రోడ్డుపై ఆగి ఉన్న ట్రయిలర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో అనేక మంది అక్కడికక్కడే మరణించారు. ఇక ముగ్గురు నుండి నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కూడా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ బస్సు జోధ్‌పూర్ నుండి భక్తులను తీసుకెళ్తున్న బస్సు బికనీర్‌లోని కొలాయత్‌ను సందర్శించి తిరిగి వస్తుండగా మథోడా సమీపంలో ప్రమాదం జరిగింది.

కర్నూల్ వద్ద బస్సు దగ్దం :

కొద్ది రోజుల క్రితమే ఒక ప్రైవేట్ బస్సు కర్నూల్ జాతీయ రహదారి వద్ద ఘోరంగా ప్రమాదానికి గురి అయి మంటలలో చిక్కుకుని 19 మంది మరణించారు. ఆ ప్రమాదానికి కారకుడు అయిన బైకర్ మృతితో కలుపుకుంటే నంబర్ 20. ఇలా ఊసుకుంటే దేశంలో వరసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల వల్ల ఇటీవల కాలంలో మరణాలు అరవై నుంచి డెబ్బై దాకా ఉన్నాయి.

రోడ్లు సేఫ్టీయేనా :

ఇక ఈ మధ్యనే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కనీ ఒక మాట అన్నారు. రహదారులు బాగులేవు అంటే తనని ఎవరూ తిట్టుకోవద్దని బాధ్యుల మీద కూడా ఫోకస్ పెట్టాలని అన్నారు. క్యూ ఆర్ కోడ్ తో ఇంజనీర్లు, రోడ్డు వేసిన వారు, కాంట్రాక్టర్లు వివరాలు అన్నీ పెడతామని దానితో ప్రజలలో చైతన్యం వస్తే ఆటోమేటిక్ రహదారుల పరిస్థితి బాగుంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే రోడ్డు ప్రమాదాలకు రహదారులు బాగు లేకపోవడమే కారణం కాదు, విపరీతమైన వేగం కూడా అంటున్నారు. వారిని అదుపు చేసే వారు కానీ వ్యవస్థలు కానీ అందుబాటులో లేకపోవడం వల్లనే భయం అన్నది లేకుండా పోతోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ ది తప్పు అని అంటున్నారు. ఎవరిది తప్పు అయినా రోడ్డు మీదకు బస్సు వస్తోంది అంటే ప్రమాదం కూడా పొంచి ఉంటే మాత్రం ఎక్కేందుకు జనాలు విపరీతంగా భయపడుతున్నారు. అన్ని శాఖలు కో ఆర్డినేట్ చేసుకుని ఈ ప్రమాదాలను అరికట్టాల్సి ఉంది. అలాగే శిక్షలను కూడా కఠినంగా చేసి వేగంగా అమలు చేస్తేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News