నిన్న విస్కీ, నేడు బీర్... భారతీయ బ్రాండ్స్ కు అవార్డుల పంట!

ఈ క్రమంలో తాజాగా ఆసియా బీర్ ఛాలెంజ్ లోనూ భారతీయ బ్రాండ్స్ తమ ఆధిపత్యాన్ని చూపించాయి!;

Update: 2025-10-11 16:33 GMT

ఇటీవల జరిగిన లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్‌ - 2025లో ప్రపంచ విస్కీ విభాగంలో ఐదు విస్కీలు ఫైనల్స్‌ కు చేరుకోగా.. ఈ ఐదు స్లాట్‌ లలో నాలుగు కైవసం చేసుకుని భారతీయ విస్కీలు ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆసియా బీర్ ఛాలెంజ్ లోనూ భారతీయ బ్రాండ్స్ తమ ఆధిపత్యాన్ని చూపించాయి!

అవును... గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్‌ లో భారతీయ బ్రాండ్స్ అయిన ఇంద్రీస్ దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ - 2025 మార్సాలా కాస్క్ ఫినిష్ 99.1 పాయింట్లతో ప్రపంచ బెస్ట్ విస్కీగా అగ్రశ్రేణి గౌరవాలను పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆసియా బీర్ ఛాలెంజ్ - 2025లో రెండు భారతీయ బ్రాండ్లు ఆరు అవార్డులను గెలుచుకున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన బీర్ పోటీలలో 'ఆసియా బీర్ ఛాలెంజ్' ఒకటి. ఇందులో ప్రధానంగా చైనా, భారత్, జపాన్ తో పాటు మరిన్ని దేశాల బ్రాండ్స్ పాల్గొంటాయి. ఇది బ్రూవర్లకు ఆసియా అంతటా వారి నాణ్యమైన బీర్లను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రెండు భారతీయ బ్రాండ్లు.. దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్, కిమాయా హిమాలయన్ బెవరేజెస్ ఎల్.ఎల్.పీ అత్యుత్తమ ప్రదర్శనకారులుగా నిలిచాయి. ఇందులో భాగంగా... ఈ పోటీల్లోని వివిధ విభాగాలలో ఆరు అవార్డులను గెలుచుకున్నాయి.

కిమయ హిమాలయన్ బెవరేజెస్ ఎల్.ఎల్.పీ!:

ఈ క్రమంలో.. కిమయ హిమాలయన్ బెవరేజెస్ ఎల్.ఎల్.పీ.. తన ప్రసిద్ధ 'బీయంగ్' శ్రేణి బీర్లతో బలమైన ముద్ర వేసింది. ఇందులో భాగంగా... బియాండ్ ఇంటర్నేషనల్ స్టైల్ పిల్స్నర్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇదే సమయంలో... ప్రీమియం స్ట్రాంగ్ బీర్ విభాగంలోనూ సత్తా చాటుతూ.. స్ట్రాంగ్ లాగర్ విభాగంలోనూ ఆ బ్రాండ్ వెండి పతకాన్ని గెలుచుకుంది.

దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్!:

ఇక, భారతదేశంలోని పురాతన బ్రూవరీలలో ఒకటైన దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్ కూడా ఈ పోటీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఇందులో భాగంగా... వారి ప్రధాన ఉత్పత్తి అయిన గాడ్ ఫాదర్ సూపర్ స్ట్రాంగ్ ఫైనెస్ట్ బీర్.. స్ట్రాంగ్ లాగర్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆసియాలో అత్యుత్తమ స్ట్రాంగ్ బీర్ అనే బిరుదును సంపాదించింది.

విట్‌ బియర్ విభాగంలో సిక్స్ ఫీల్డ్స్ బ్లాంచే ఫైనెస్ట్ వీట్ బీర్‌ కు రజత పతకం.. డబ్బెల్ విట్ / ఇంపీరియల్ వైట్ విభాగంలో సిక్స్ ఫీల్డ్స్ కల్ట్ ఫైనెస్ట్ స్ట్రాంగ్ వీట్ బీర్ కు రజత పతకం.. తో పాటు ఆస్ట్రేలేషియన్, లాటిన్ అమెరికన్ లేదా ట్రాపికల్ స్టైల్ లైట్ లాగర్ విభాగంలో గాడ్‌ ఫాదర్ ది లెజెండరీ లగ్జరీ లాగర్ బీర్‌ కు కాంస్య పతకం దక్కాయి.

Tags:    

Similar News