ఎలన్ మస్క్ X సంస్థకు 72 గంటల డెడ్‌లైన్‌.. కేంద్రం సీరియస్

ఎలన్ మస్క్ కు చెందిన ‘గ్రోక్ ఏఐ’ ద్వారా సృష్టించబడిన అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.;

Update: 2026-01-03 05:40 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ఒక వైపు మానవ మేధస్సుకు ప్రతిరూపంగా నిలుస్తుంటే.. మరో వైపు అదే సాంకేతికత మహిళల గౌరవానికి భంగం కలిగించేలా తయారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎలన్ మస్క్ కు చెందిన ‘గ్రోక్ ఏఐ’ ద్వారా సృష్టించబడిన అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

అసలేం జరిగింది?

ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ‘ఎక్స్’ వేదికపై అందుబాటులో ఉన్న గ్రోక్ ఏఐ టూల్స్ ను ఉపయోగించి కొంత మంది దుండగులు మహిళల అనుమతి లేకుండా వారిని అసభ్యకరంగా.. అశ్లీలంగా చూపే చిత్రాలను సృష్టిస్తున్నారు. ఈ చిత్రాలను నకిలీ ఖాతాల ద్వారా వైరల్ చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది.

ఎక్స్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు..

జనవరి 2న కేంద్రప్రభుత్వం ఎక్స్ కార్ప్ ఇండియా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలున్నాయి. గ్రోక్ ఏఐ దుర్వినియోగంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ 72 గంటల్లోపు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ధేశిత సమయంలోగా సరైన సమాధానం ఇవ్వకపోతే ఐటీ చట్టం కింద ఎక్స్ సంస్థకు ఉన్న చట్టపరమైన రక్షణ రద్దవుతుందని కేంద్రం హెచ్చరించింది. అంటే వినియోగదారులు చేసే తప్పులకు సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభ్యంతకర కంటెంట్ జనరేట్ కాకుండా కఠినమైన ఏఐ గార్డ్ రైల్స్ వెంటనే అమలు చేయాలని సూచించింది.

ఐటీ చట్టం ఏం చెబుతోంది?

భారత దేశ ఐటీ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు తమ వేదికపై అశ్లీల లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలి. ముఖ్యంగా మహిళల గౌరవానికి భగం కలిగించే కంటెంట్ ను 24 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. గ్రోక్ వంటి ఏఐ సాధనాలు నేరుగా అశ్లీల చిత్రాలను సృష్టించడం దేశ భద్రతకు , సామాజిక సామరస్యానికి ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తోంది.

రాజకీయ, సామాజిక స్పందన

గత కొన్ని రోజులుగా పలువురు మహిళా నేతలు, సెలబ్రెటీలు ఈ డీప్ ఫేక్ చిత్రాల బారినపడ్డారు. దీనిపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘డిజిటల్ వేదికల్లో మహిళ భద్రత ప్రభుత్వం ప్రాధాన్యత’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఇప్పటివరకూ ఎలన్ మస్క్ కానీ.. ట్విట్టర్ ఎక్స్ సంస్థ కానీ అధికారికంగా స్పందించలేదు.

సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, దానిపై నియంత్రణ లేకపోతే అది వినాశనానికి దారితీస్తుందని ఈ ఘటన నిరూపించింది. కేంద్రం ఇచ్చిన 72 గంటల గడువు ముగిసిన తర్వాత ఎక్స్ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News