బిగ్ క్వ‌శ్చ‌న్‌: డీలిమిటేష‌న్ ఉన్న‌ట్టా.. లేన‌ట్టా ..!

పార్ల‌మెంటులో ప్ర‌స్తుతం వీగిపోయిన బిల్లులో కొన్ని మార్పులు చేయడం ద్వారా.. తిరిగి దీనిని తీసుకువ‌చ్చి ఆమోదించుకునే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది.;

Update: 2026-04-20 13:30 GMT

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ల‌పై గ‌త నాలుగైదు రోజుల పాటు భారీ ఎత్తున జ‌రిగిన చ‌ర్చకు పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు బ్రేకిచ్చాయి. దీనికి సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు 131ని వీగిపోయేలా చేశాయి. దీంతో ఈ రెండు ప్ర‌తిపాద‌న‌లు కూడా ఇప్పుడు ఆగిపోయాయి. అయితే.. చ‌ర్చ మాత్రం కొన‌సాగుతోంది. వాస్త‌వానికి.. డీలిమిటేష‌న్‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులు ఆమోదం పొందేస్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు లెక్క‌లు వేసేసుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూడా.. త‌మ లెక్క‌లు తాము స‌రిచూసుకున్నారు. కానీ, అనూహ్య ప‌రిణామంతో వారి లెక్క‌లు త‌ప్పిన‌ట్టు అయింది. అయితే.. వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల్లో అయినా.. ఈ రెండు ఆమోదం పొంద‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఉంది. పార్ల‌మెంటులో ప్ర‌స్తుతం వీగిపోయిన బిల్లులో కొన్ని మార్పులు చేయడం ద్వారా.. తిరిగి దీనిని తీసుకువ‌చ్చి ఆమోదించుకునే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది. అయితే.. ఇది జ‌రుగుతుందా? లేదా? అనేది చూడాలి.

కానీ.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మాత్రం అనేక ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ త‌మ కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను తీసుకురావాల‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఒక్క నాయ‌కుల‌కే కాదు.. టీడీపీ వంటి బ‌ల‌మైన పార్టీకి కూడా.. ప్ర‌స్తుత ప‌రిణామం అంతుచిక్క‌డం లేదు. ఇటీవ‌లే మ‌హిళా నాయకుల‌ను పెంచుకునే దిశ‌గా పార్టీ అడుగులు వేసింది. డీలిమిటేష‌న్ జ‌రిగి.. సీట్లు పెరిగితే.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసింది.

ఇప్పుడు కాక‌పోతే..

ఒక‌వేళ‌.. వ‌చ్చే వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా.. ఈ వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌పోతే.. ఏం జ‌రుగు తుంది? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2023 నాటి మ‌హిళా బిల్లు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం స‌వివ‌రంగా గెజిట్‌ను జారీ చేసింది. దీని ప్ర‌కారం.. 2034లో జ‌రిగే ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2029 నాటికి డీలిమిటేష‌న్ జ‌రిగినా.. వాటి అమ‌లు మాత్రం.. 2034 నుంచే ఉంటుంది. అంటే.. దాదాపు 8 ఏళ్ల‌పాటు వెయిట్ చేయాలి. దీనిపై ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News