మిస్ కావొద్దు: శేఖర్ కమ్ముల రీల్ స్టోరీలా సీఎంసీ తొలి కమిషనర్ రియల్ లవ్ స్టోరీ
సివిల్స్ సాధించాలని పట్టుదలతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో.. గ్రూప్ 1 రాసి జాబ్ లో చేరా.;
టాలీవుడ్ లో చాలామంది దర్శకులు ఉన్నా.. శేఖర్ కమ్ముల మూవీస్ కాస్త భిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరోయిన్ బలంగా ఉండటమే కాదు.. తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే గుణం ఉంటుంది. అంతకు మించి.. బంధాల్ని సున్నితంగా.. మనసును ఆకట్టుకునేలా తీయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సినిమాలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాదిరే ఉంటాయి. ఒక ఆనంద్.. ఒక గోదావరి.. అలా.. ఆ సినిమాల్ని ఎప్పుడు చూసినా ఒకలాంటి పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే లవ్ స్టోరీ కూడా ఆకోవకు చెందిందే. శేఖర కమ్ముల రీల్ స్టోరీకి ఏ మాత్రం తగ్గని రియయల్ స్టోరీని మిస్ కావొద్దు.
ఇంతకూ ఇప్పుడు చెప్పే లవ్ స్టోరీ సీఎంసీ తొలి కమిషనర్. అదేనండి.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి సృజన జీవితంలోని ప్రేమకథ గురించి తెలిస్తే మనసుకు హాయిగా అనిపించటమే కాదు.. ప్రేమకథ అంటే ఇంత ఆహ్లాదంగా ఉండాలి కదా? అన్న భావన కలుగుతుంది. ఇంతకూ ఆమె తన లవ్ స్టోరీ గురించి ఏం చెప్పారో ఆమె మాటల్లోనే...
మాది లవ్ మ్యారేజ్. నా భర్త రవితేజ ఏపీ హైకోర్టులో న్యాయవాది. మా ప్రేమ పుట్టింది హైదరాబాద్ లోనే. అప్పట్లో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేస్తున్నా. అప్పట్లో రవి విజయవాడలో లా చదువుతున్నారు. రవి తీరు అందరితో కలిసిపోవటమైతే.. నాది అందుకు భిన్నం. అయితే.. ఇద్దరికి పుస్తకాలు చదవటం చాలా ఇష్టం. సామాజిక అంశాల మీద గంటల తరబడి మాట్లాడుకోవటం ఇష్టం. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండే రవి.. తరచూ మా వర్సిటీకి వచ్చేవాడు. అలా పరిచయమైన అతడి చేతిలో ‘‘బీయింగ్ అండ్ నథింగ్ నెస్’’ అన్న పుస్తకం చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఫ్రెంచ్ తత్త్వవేత్త జీన్ పాల్ సార్త్రే రాసిన ఈ పుస్తకం తత్త్వ శాస్త్రంలోనే అత్యంత ఎఫెక్టు ఉన్నది చెబుతారు. అంత చిన్న వయసులో ఆ పుస్తకాన్ని చదివేవాళ్లు అప్పటివరకు నాకెవరూ కనిపించలేదు.
అది రవిపైన మరింత ఆసక్తిని కలిగించేలా చేసింది. ఇద్దరం పలు పుస్తకాల్ని తరచూ చదివేవాళ్లం. సామాజిక.. ఆర్థిక..రాజకీయ అంశాలపైస్పష్టమైన అవగామన ఉన్న రవికి ఉన్న మరో మంచి అలవాటు.. ఎవరిని జడ్జ్ చేయడు. వాళ్లు అలా.. వీళ్లు అలా అని కంప్లైంట్లు చేయడు. ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నించడు. ఇలాంటి అరుదైన లక్షణాలు అతడిలో ఉండటంతో ఒకసారి నేనే చొరవ తీసుకొని.. మీరంటే నాకు ఇష్టమని ప్రపోజ్ చేశా. కారణం తెలీదు కానీ.. నేను ప్రపోజ్ చేసిన మూడు నెలల తర్వాత అతడి నుంచి రిప్లై వచ్చింది. ప్రేమికులంటే పరస్పరం బోలెడు బహుమతులు ఇచ్చుకోవటం నాకు నచ్చదు. సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఇద్దరం కలిసి నడుస్తూ గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్లం. పలు అంశాల మీద చర్చించుకునేవాళ్లం. ఎప్పుడైనా కాఫీ షాపులకు వెళితే.. ట్రాన్స్ పోర్టు ఛార్జీలు ఎవరివి వారుగా పెట్టుకునేవాళ్లం. ప్రేమలో పరస్పర గౌరవంతో పాటు.. ఆర్థికస్వేచ్ఛ కూడా చాలా అవసరం.
ఏదైనా అంశంపై రవి తన అభిప్రాయాన్ని చెబితే మౌనంగా వింటా. తర్వాత నా అభిప్రాయాన్ని వివరిస్తా. ఇద్దరి మధ్య ఇగోలకు తావులేదు. మా నాన్నకు మా ప్రేమ గురించి చెప్పా. ఆయన ఎవరోకాదు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ గా పని చేసిన బలరామయ్యగారు. పెళ్లి చేసుకోవలని అనుకుంటున్నా అన్నంతనే రవినే కదా? అని అడిగారు. అమ్మమొదట్లో ఒప్పుకోకున్నా.. నాన్నే నచ్చజెప్పారు. అలా 2011 ఫిబ్రవరి 26న సింఫుల్ గా పెళ్లి చేసుకున్నాం. భర్తగా కాకుండా రవితేజ స్నేహితుడిగా ఉంటాడు. మా అబ్బాయికి భోజనం పెట్టటంలో నాకంటే అతడే బెటర్.
సివిల్స్ సాధించాలని పట్టుదలతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో.. గ్రూప్ 1 రాసి జాబ్ లో చేరా. నాన్న మాదిరి ఐఏఎస్ కావాలన్న కోరిక తీరలేదు. అయితే.. సివిల్స్ కు మరో అవకాశం ఉంది కదా? అని రవినే గుర్తు చేసి.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా చేశాడు. వెన్నంటి ఉండి ప్రోత్సహించాడు. కోచింగ్ లో భాగంగా ఢిల్లీకి వెళితే.. అక్కడ ఏర్పాట్లు మొత్తం తానే చూసుకున్నాడు. నేను సివిల్స్ మీద ఫోకస్ చేసి ఆ ఏడాది 44వ ర్యాంక్ సాధించా. అందుకే.. ఐఏఎస్ కావటంతో రవికే క్రెడిట్ ఇస్తా. ప్రేమలో ఒకరిపట్ల మరొకరికి గౌరవం తప్పనిసరి. అదెప్పటికి మిస్ కాకూడదు.