టీమిండియా మ్యాచ్.. జనాలు లేరంటే నమ్మగలరా? కానీ ఇది నిజం

స్టేడియంలో మ్యాచ్ అయితే సాగుతోంది కానీ ప్రేక్షకులు మాత్రం "లైవ్ టెలికాస్ట్‌ ఉండగా ఎండలో ఎవరు కూర్చుంటారు బ్రదర్.. ఇంటి నుంచే చూస్తాం" అంటూ టీవీలకు పరిమితమైపోయారు.

Update: 2026-06-08 09:14 GMT

భారతదేశంలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్.. క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే అభిమానులు ఇక్కడ కోట్లలో ఉన్నారు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. తిరుమల లడ్డూ కౌంటర్ కంటే దారుణంగా క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. కానీ తాజాగా పంజాబ్ లోని చంఢీగడ్ ముల్లాన్ పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మాత్రం ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. స్టేడియంలో మ్యాచ్ అయితే సాగుతోంది కానీ ప్రేక్షకులు మాత్రం "లైవ్ టెలికాస్ట్‌ ఉండగా ఎండలో ఎవరు కూర్చుంటారు బ్రదర్.. ఇంటి నుంచే చూస్తాం" అంటూ టీవీలకు పరిమితమైపోయారు.

కెమెరామెన్ల ‘జూమ్’ కష్టాలు.. జడేజా ఫ్రీ అడ్వైజ్!

స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్యను చూసిన కామెంటేటర్లు సైతం కాసేపు షాక్‌కు గురయ్యారు. ఒకవేళ స్కోర్‌బోర్డ్‌లో ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందా? అని క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కనీసం వెయ్యి మంది కూడా గ్యాలరీల్లో కనిపించకపోవడంతో ప్రేక్షకుల షాట్లు చూపించడానికి కెమెరామెన్లు తమ కెమెరా లెన్స్‌ను ఏకంగా 400 శాతం వరకు జూమ్ చేయాల్సి వచ్చిందట!

ఈ దారుణ పరిస్థితిని చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తనదైన శైలిలో స్పందించారు. "ఇకపై చంఢీగడ్ లో టెస్ట్ మ్యాచ్‌లు పెట్టకండి.. కనీసం ప్రేక్షకులు వచ్చే వేదికలను ఎంచుకోండి" అంటూ బీసీసీఐకి ఉచిత సలహా ఇచ్చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత.. అసలు చంఢీగడ్ లో టెస్ట్ మ్యాచ్ చూడటానికి వచ్చే క్రికెట్ అభిమానులను వెతకడానికి బీసీసీఐ ప్రత్యేక శోధన బృందాన్ని ఏర్పాటు చేయాలా? అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

ఐపీఎల్‌కు క్యూలైన్లు.. టెస్టులకు రీల్స్ స్క్రోలింగ్!

ఇదే చంఢీగడ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినప్పుడు టికెట్ల కోసం అభిమానులు కొట్టుకున్నంత పని చేశారు. కానీ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అనగానే చాలామంది "బాబోయ్.. ఐదు రోజులు కూర్చోవాలా?" అంటూ మొబైల్స్‌లో రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

అందులోనూ ప్రత్యర్థి జట్టు ఆఫ్ఘనిస్థాన్ కావడం.. క్లైమాక్స్ ముందే తెలిసిపోయిన సినిమా లాంటి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో లేకపోవడంతో "స్టేడియంకి వెళ్లే పెట్రోల్ ఖర్చు కూడా దండగే" అని స్థానిక ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయినట్లున్నారు.

మ్యాచ్ ఒన్‌సైడ్.. కానీ అసలు థ్రిల్లర్ అదే!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైదానంలో ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా టీమిండియా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోరు 564 పరుగులు బోర్డుపై పెట్టి ఆఫ్ఘనిస్థాన్‌ను ఫాలోఆన్ ఉచ్చులోకి నెట్టేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్థాన్ కేవలం 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ఆ కొద్దిమంది ప్రేక్షకులు మాత్రం.. "ఆఫ్ఘన్ బ్యాటర్ల కంటే మేమే ఎక్కువసేపు స్టేడియంలో నిలబడ్డాం" అనే గర్వంతో కాలర్ ఎగరేసుకుంటూ ఇంటి దారి పట్టారు!

మొత్తానికి భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్న సస్పెన్స్ కంటే.. చంఢీగడ్ స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కనీసం మూడు అంకెలు దాటుతుందా లేదా అనేదే ఈ టెస్ట్ మ్యాచ్‌కి అసలైన థ్రిల్లర్‌గా మారింది. ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న ఈ స్టేడియంలో తదుపరి రోజుల్లోనైనా జనాలు కనిపిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News