రక్షణ రంగంలో కాంట్రాక్టులు.. సినిమా డైలాగులతో ఐఏఎఫ్ చీఫ్ సంచలనం!

తాజాగా సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించిన ఆయన... చాలాసార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని.. కానీ, ఆయుధాలు మాత్రం ఎప్పటికీ అందవని అన్నారు.;

Update: 2025-05-29 14:30 GMT

రక్షణ రంగంలో కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్.. ఇండస్ట్రీ సకాలంలో నెరవేర్చలేని వాగ్ధాలు చేయవద్దని కోరారు. సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ - 2025లో మాట్లాడిన ఆయన.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అవును... రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావంటూ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్ల డెలివరీలో జాప్యంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసిన సుమారు మూడు నెలల తర్వాత మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించిన ఆయన... చాలాసార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని.. కానీ, ఆయుధాలు మాత్రం ఎప్పటికీ అందవని అన్నారు. ఇక్కడ టైమ్ లైన్ అనేది ప్రధాన సమస్య అని చెబుతూ.. సకాలంలో పూర్తైన ఒక్క ప్రాజెక్టు కూడా తనకు గుర్తురావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో.. తేజస్ ఎంకే2 ప్రోటోటైప్ కూడా అందుబాటులోకి రాలేదని.. ఇక, అమ్కా ఫైటర్ కు సంబంధించి ఇప్పటి వరకూ మోడల్ విమానం కూడా రాలేదని వ్యాఖ్యానించిన ఆయన.. మనం చేయలేని పనికి వాగ్ధానాలు చేయడం ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... మన దళాలు, పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని.. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దానిని అందించి తీరాల్సిందేనని అమర్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమయంలో మేకిన్ ఇండియా కోసం ఎయిర్ ఫోర్స్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని.. మనం ఈ రోజు సిద్ధంగా ఉంటేనే ఫ్యూచర్ కు సన్నద్దం కాగలమని తెలిపారు.

ఇక డ్రోన్ టెక్నాలజీ రాకతో మారుతున్న యుద్ధ స్వభావాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. సాయుధ దళాల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను సకాలంలో ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. యుద్ధ స్వభావం మారుతోందని.. అపరేషన్ సిందూర్ మనం ఎక్కడికి వెళ్తున్నామో, భవిష్యత్తులో మనకు ఏమి అవసరమో స్పష్టమైన ఆలోచనను ఇచ్చిందని ఆయన అన్నారు.

ఎయిర్ ఫోర్స్ చీఫ్ నోట సినిమా డైలాగ్!:

ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ను పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్లు వెల్లడించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. యుద్ధంలో ఆధునిక సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞాన వినియోగం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ సిన్మా డైలాగ్ వాడటంతో.. సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమ్రోగింది.

అవును.. స్వదేశంలో తయారు అయిన రక్షణ సామాగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందని వాయుసేన దళపతి అన్నారు. ఈ సమయంలోనే... "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అనే ఫేమస్ సినిమా డైలాగ్ ను ప్రస్థావించారు. దీంతో.. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది.

Tags:    

Similar News