750 కోట్ల భూమిని తిరిగి సాధించిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక ఆపరేషన్ చేపట్టింది;
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక ఆపరేషన్ చేపట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెం.10, షేక్‌పేట్ మండల పరిధిలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఏర్పడిన ఆక్రమణలను తొలగించి రూ.750 కోట్ల విలువైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది.
బౌన్సర్లు, కుక్కలతో భూమి కాపలా!
ఈ భూమిని పార్థసారథి అనే వ్యక్తి తప్పుడు సర్వే నంబర్ (403/52) ఆధారంగా స్వంతమని చెప్పుకుంటూ ఆక్రమించాడు. ఆ ప్రాంతాన్ని కంచెతో చుట్టి, బౌన్సర్లు, కుక్కలను నియమించి కాపలాగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అసలు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 403 కింద ఉండగా, పార్థసారథి దానిని 403/52గా చూపిస్తూ నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకున్నాడు.
నీటి బోర్డు పనులకు అడ్డంకులు
ఈ ఐదు ఎకరాల్లో 1.20 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు కేటాయించింది. అయితే, పార్థసారథి ఆ భాగాన్నీ తనదిగా చూపిస్తూ వాటర్ బోర్డు నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టించాడు. స్థానికులు ఆయనపై ఫిర్యాదులు చేయడంతో పాటు, వాటర్ బోర్డు , రెవెన్యూ అధికారులు కూడా HYDRAAకి నివేదించారు.
భారీ భద్రత మధ్య కూల్చివేత
షేక్‌పేట్ రెవెన్యూ అధికారుల లేఖ ఆధారంగా HYDRAA బృందం శుక్రవారం ఉదయం భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆక్రమణలను తొలగించింది. పార్థసారథి నిర్మించిన షెడ్లు, కంచెలను కూల్చి, ప్రభుత్వ భూమి చుట్టూ కొత్త కంచె వేసి “ప్రభుత్వ భూమి” అని బోర్డులు ఏర్పాటు చేశారు.
ఒక ఏడాదిలో రూ.50,000 కోట్ల ఆస్తులు రక్షణ
HYDRAA కమిషనర్ ఏ.వి. రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఒక సంవత్సరంలో సంస్థ మొత్తం 923 ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాళాలు, రోడ్లను తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.50,000 కోట్లుగా అంచనా.
HYDRAA ఏర్పాటు చేసినప్పటి నుండి (జూలై 19, 2024) ఇప్పటి వరకు 96 డ్రైవ్‌లు నిర్వహించి, 581 ఆక్రమణలను తొలగించింది. ఇందులో 424 ఎకరాల ప్రభుత్వ భూమి, 233 ఎకరాల చెరువులు, 218 ఎకరాల రోడ్లు, 15 ఎకరాల నాళాలు, 25 ఎకరాల పార్కులు ఉన్నాయి.
5,000కు పైగా ఫిర్యాదులు
ఇప్పటి వరకు HYDRAAకు చెరువులు, పార్కులు, రోడ్లు, నాళాలు, ప్రభుత్వ భూములు, అక్రమ లేఅవుట్లపై 5,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వాటిపై సమీక్ష జరుగుతోందని అధికారులు తెలిపారు.