హైదరాబాద్ కు 650కి.మీ. మెట్రో రైల్ అవసరమన్న తాజా రిపోర్టు
దేశంలోని ప్రముఖ మహానగరాల్లో హైదరాబాద్ దూకుడు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.;
దేశంలోని ప్రముఖ మహానగరాల్లో హైదరాబాద్ దూకుడు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో మహానగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ.. ఆర్థిక రాజధానిగా ముంబయి.. బెంగళూరు.. చెన్నై..కోల్ కతా ఉండేవి. అయితే.. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ జాబితాలో మార్పు వచ్చింది. హైదరాబాద్ ప్రాధాన్యత.. ప్రాముఖ్యత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో పలు అంశాలకు సంబంధించి హైదరాబాద్ మహానగరం టాప్ 3 సిటీస్ లో ఒకటిగా మారుతోంది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరానికి కీలకమైన ప్రజారవాణాలో మెట్రో రైలు ప్రాధాన్యతను తెలియజేయటమే కాదు.. మెట్రో విస్తరణను ఎంత భారీగా చేపట్టాలన్న విషయాన్ని లీ అసోసియేట్స్ అధ్యయన సంస్థ తాజాగా చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి. 2050నాటికి.. అంటే మరో పాతికేళ్లకు హైదరాబాద్ మహానగర జనాభా 3.5 కోట్లు దాటుతుందని.. అప్పటికి మెట్రో రైలు వ్యవస్థ 640కి.మీ. వరకు ఉండాల్సి ఉంటుందని అంచనా వేసింది.
భవిష్యత్ లో ప్రజారవాణా అవసరాలను పరిగణలోకి తీసుకుంటే మెట్రో విస్తరణ ఎంతో కీలకమన్న ఈ నివేదిక.. అప్పటికి రోజు వారీగా 65 లక్షల మందికి పైనే మెట్రో సేవల్ని వినియోగించుకునే వీలుందని పేర్కొంది. 2050 నాటికి నాలుగు దశలుగా మెట్రో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇప్పుడున్న అవుటర్ రింగు రోడ్డును రీజనల్ రింగు రోడ్డు వరకు మహానగరాన్ని విస్తరించినప్పుడు.. అందుకు అనుగుణంగా అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెంచాల్సి ఉంటుందని చెప్పింది.
హైదరాబాద్ సమగ్ర మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా సమగ్ర రవాణా ప్రణాళికపై లీ అసోసియేట్స్ ను కన్సెల్టీన్సగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ హైదరాబాద్ మహానగరానికి అవసరమైన రోడ్లు.. రవాణా సదుపాయాలు.. ఎంఎంటీఎస్ తో పాటు మెట్రో సేవల విస్తరణపైనా అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం మెట్రో విస్తరణ రెండో దశలో 8 మార్గాల్లో విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేయటం తెలిసిందే.
ప్రభుత్వం అనుకున్నట్లుగా ఈ రెండో దశ 2030 నాటికి అందుబాటులోకి వచ్చి ప్రజలు వినిగిస్తే.. మెట్రో ప్రయాణికులసంఖ్య రోజువారీగా 15 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. మూడో దశలో 2040 నాటికి పెరగనున్న జనాభా అవసరాలకు అనుగుణంగా 340 కి.మీ. మేర మెట్రో రైలును విస్తరించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మూడో దశ అందుబాటులోకి వస్తే రోజువారీగా మెట్రో ప్రయాణికుల సంఖ్య 35 లక్షలు దాటుతుందని..2050 నాటికి 640కి.మీ. మేర మెట్రో మార్గాల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
తన పూర్తి నివేదికను ఈ సంస్థ సెప్టెంబరులో ప్రభుత్వానికి సమర్పించనుంది. అయితే.. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు ఆలస్యంగా వస్తున్నాయన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో త్వరతిగతిన మెట్రో రైలు అనుమతులపై కేంద్రం మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. రెండో దశకు సంబంధించిన అనుమతుల కోసం తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు అంతకంతకూ ఆలస్యం కావటం గమనార్హం.