హైదరాబాద్ ఐటీ రంగానికి గ్రహణం? గణాంకాలు చెబుతున్న చేదు నిజం
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతున్న భాగ్యనగర ఐటీ కోటకు బీటలు వారుతున్నాయా? దశాబ్ద కాలంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ రంగం..;
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతున్న భాగ్యనగర ఐటీ కోటకు బీటలు వారుతున్నాయా? దశాబ్ద కాలంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ రంగం.. ఇప్పుడు మొదటిసారిగా తిరోగమనం వైపు అడుగులు వేస్తోందా? కేవలం గణాంకాల తగ్గుదల మాత్రమే కాదు.. ఏఐ విసిరిన సవాలు.. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి హైదరాబాద్ ఐటీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాజకీయ విమర్శల వెనుక దాగి ఉన్న అసలు చేదు నిజం ఏమిటి? ఇది కేవలం ఒక తాత్కాలిక మందగమనమా లేక పెను సంక్షోభానికి సంకేతమా? అన్నది చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గడిచిన దశాబ్ద కాలంగా అప్రతిహత వృద్ధితో దూసుకుపోయిన ఈ రంగంలో మొదటిసారిగా 'రివర్స్ ట్రెండ్' కనిపిస్తుండటం అటు నిరుద్యోగులను, ఇటు ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది.
గణాంకాలు చెబుతున్న చేదు నిజం
తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ సెగలను మించి ఐటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2023లో 9.46 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య, 2026 నాటికి 9.39 లక్షలకు పడిపోయిందని ప్రభుత్వం స్వయంగా గణాంకాల్లో వెల్లడించడం గమనార్హం. అంటే మూడేళ్ల కాలంలో సుమారు 7,000 ఉద్యోగాల తగ్గుదల నమోదైంది. సాధారణంగా ఏటా లక్షల్లో కొత్త ఉద్యోగాలు రావాల్సిన చోట.. ఉన్నవి తగ్గిపోవడం ఐటీ హబ్‌గా హైదరాబాద్ ప్రతిష్టకు సవాలుగా మారింది.
సంక్షోభానికి కారణాలేమిటి?
ఈ తిరోగమనానికి కేవలం స్థానిక పరిస్థితులే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వేలాది మంది అవసరమయ్యే కోడింగ్, టెస్టింగ్ , సపోర్ట్ పనులను ఇప్పుడు ఏఐ సెకన్లలో చేస్తోంది. ఆటోమేషన్ వల్ల కంపెనీలు 'లీన్ మేనేజ్‌మెంట్' తక్కువ మందితో ఎక్కువ పని వైపు మొగ్గు చూపుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం
భయాలు, వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల ఐటీ ప్రాజెక్టుల బడ్జెట్‌లో కోతలు పడ్డాయి. మన ఐటీ రంగం ప్రధానంగా విదేశీ క్లయింట్లపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం నేరుగా ఇక్కడ కనిపిస్తోంది. పాత పద్ధతుల్లో సాగే సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్ పనులు తగ్గిపోతున్నాయి. కంపెనీలు కేవలం హై-లెవల్ నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే తీసుకుంటున్నాయి, దీనివల్ల కొత్తవారికి అవకాశాలు దెబ్బతింటున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై పడనున్న 'చైన్ ఎఫెక్ట్'
ఐటీ రంగం కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదు. ఇది ఒక పెద్ద ఎకోసిస్టమ్. ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపైనే హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్, హోటల్ రంగం, రవాణా, రిటైల్ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగాల కోత లేదా వేతనాల స్తబ్దత కొనసాగితే గృహ రుణాలు వినియోగ వస్తువుల విక్రయాలు తగ్గి, నగరం యొక్క మొత్తం ఆర్థిక చక్రం మందగించే ప్రమాదం ఉంది.
ముందున్న మార్గం: నైపుణ్యమే ఆయుధం
రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఐటీ రంగం ఇప్పుడు ఒక పరివర్తన దశలో ఉందన్నది కాదనలేని వాస్తవం. భవిష్యత్తులో కేవలం రొటీన్ పనులు చేసేవారికి చోటు ఉండదు. "పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఇది ముగింపు కాదు. జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలలో ఉద్యోగులు త్వరగా నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది." అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వం కూడా కేవలం ఉన్న కంపెనీలను కాపాడుకోవడమే కాకుండా, కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా 'స్కిల్లింగ్ సెంటర్స్' పై దృష్టి పెట్టాలి. ఈ హెచ్చరికను గమనించి అప్రమత్తం కాకపోతే హైదరాబాద్ సాధించిన ఐటీ కీర్తి మసకబారే ప్రమాదం ఉంది.