అందుకే హెచ్ఐవీ ఇంజెక్షన్ వేశా.. పోలీసుల ముందు అసలు నిజం చెప్పిన ప్రియుడు
అయితే ఆ బాధ క్రమంగా పగగా మారింది. “ఆమెకు కూడా ఈ వ్యాధి సోకితే మరెవరూ పెళ్లి చేసుకోరు… చివరకు నన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది” అనే వికృత ఆలోచన అతని మనసులో పెరిగింది.;
హైదరాబాద్ నగరంలో సభ్య సమాజాన్ని కుదిపేసేలా ఒక దారుణ ఘటన ఇప్పటికీ అందరినీ కలిచివేస్తోంది. ప్రేమ పేరుతో ప్రారంభమైన సంబంధం చివరికి ప్రతీకారానికి దారి తీసి.. ఒక యువకుడు తన ప్రియురాలి జీవితాన్నే అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో తనకు ఉన్న హెచ్ఐవీ వ్యాధిని ప్రియురాలికి కూడా అంటించిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనగామ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మనోహర్ ఉపాధి కోసం కొంతకాలంగా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ప్రస్తుతం ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తూ ఒక ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన వరసకు మరదలు అయ్యే యువతితో అతనికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వారి పెళ్లి కూడా నిశ్చయమైంది.
అయితే పెళ్లి ముందు యువకుడి కుటుంబ ఆరోగ్య పరిస్థితిపై యువతి తండ్రికి అనుమానం కలిగింది. యువకుడి తండ్రి గతంలో అనారోగ్యంతో మరణించగా తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతోందని తెలిసింది. దీంతో పెళ్లికి ముందు వైద్య పరీక్షలు చేయించాలని యువతి కుటుంబం పట్టుబట్టింది. పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో యువతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
ఈ పరిణామం మనోహర్‌ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అయితే ఆ బాధ క్రమంగా పగగా మారింది. “ఆమెకు కూడా ఈ వ్యాధి సోకితే మరెవరూ పెళ్లి చేసుకోరు… చివరకు నన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది” అనే వికృత ఆలోచన అతని మనసులో పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన ఒక సిరంజీ కొనుగోలు చేసి తన రక్తాన్ని అందులో నింపుకున్నాడు.
ఆ రోజు యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన మనోహర్ మరోసారి పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంట తెచ్చుకున్న సిరంజీతో తన రక్తాన్ని బలవంతంగా యువతి శరీరంలోకి ఇంజెక్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన తర్వాత భయంతో యువతి ఎవరికీ విషయం చెప్పలేదు. కానీ రెండు రోజుల తర్వాత ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో పాటు ఇంజెక్షన్ గుచ్చిన చోట వాపు రావడంతో తల్లిదండ్రులు అనుమానించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆ గాయాన్ని గమనించి ప్రశ్నించగా యువతి జరిగిన దారుణాన్ని వెల్లడించింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.
ప్రేమ పేరుతో ఒక యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజంలో పెరుగుతున్న వికృత ఆలోచనలు, మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.