ఈ వర్షాలేంది? హైదరాబాద్ ఆకాశాన చిల్లు పడిందా?

ఎప్పుడెప్పుడు వానలు పడతాయా? అన్నట్లు ఎదురుచూసిన రోజుల నుంచి నీకు దండం సామి.. ఇక వానలొద్దన్నట్లుగా వేడుకునే పరిస్థితికి వచ్చారు హైదరాబాద్ మహానగర ప్రజలు.;

Update: 2025-09-18 04:32 GMT

ఎప్పుడెప్పుడు వానలు పడతాయా? అన్నట్లు ఎదురుచూసిన రోజుల నుంచి నీకు దండం సామి.. ఇక వానలొద్దన్నట్లుగా వేడుకునే పరిస్థితికి వచ్చారు హైదరాబాద్ మహానగర ప్రజలు. ఈ ఏడాది వర్షాలు హైదరాబాదీయులకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షమంటే చాలు హడలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న వర్షాలు ఒక ఎత్తు అయితే.. నాన్ స్టాప్ గా కురుస్తూ.. అతి తక్కువ వ్యవధిలో దంచికొట్టిన వానలతో నగరజీవులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఆదివారం కురిసిన వర్షం దడుపు నుంచి తేరుకోని హైదరాబాద్ మహానగర ప్రజలకు.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన భారీ వర్షం.. ఫేజ్ ల చొప్పునఅర్థరాత్రి ఒంటి గంట వరకు ఎంత కుండపోతగా కురిసిందో తెలిసిందే. ఈ భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం మొత్తం తడిచి ముద్ద కావటమే కాదు.. వీధులన్ని జలమయమయ్యాయి. పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. రోడ్డు తటాకాల్ని తలపించాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఉద్ధ్రతంగా ప్రవహించటంతో వాహనదారులు.. పెద్ద వయస్కులు.. మహిళలు.. చిన్నారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

కుండపోత వానంతో పలు ప్రాంతాల్లో టూవీలర్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.కొన్నిచోట్ల బలహీనంగా ఉన్న గోడలు కూలాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వేగంగా దూసుకెళుతున్న వేళ.. ఆ రహదారుల్లోకి ప్రయాణాల్ని పోలీసులు.. హైడ్రా సిబ్బంది ఆపేశారు.

బుధవారం అర్థరాత్రి12 గంటలవరకు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి సంబంధించిన గణాంకాల్ని చూస్తే.. వర్ష తీవత్రత ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమవుతుంది. ఈ సీజన్ మొత్తంలో అత్యధిక వర్షపాతం బుధవారం నమోదైంది. ముషీరాబాద్ లో గరిష్ఠంగా 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. భోలక్ పూర్ లో 15.8 సెం.మీ., బేగంపేటలో 14.6సెం.మీ, సికింద్రాబాద్ లో 14 సెం.మీ., శేరిలింగంపల్లిలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్ లో 12.7 సెం.మీ, ఖైరతాబాద్ లో 1.24సెం.మీ, లింగంపల్లిలో 11.5సెం.మీ., జూబ్లీహిల్స్ లో 10.8 సెం.మీ., షేక్ పేట 10.5 సెంటీమీటర్లు, బాలానగర్ లో 10సెం.మీ., కాప్రాలో 9.4 సెం.మీ, హిమాయత్ నగర్ లో 9.2సెం.మీ. వర్షపాతం నమోదైంది.

మొత్తంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావటమేకాదు.. హైదరాబాద్ మహానగరం మీదున్న ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా? ఈ వర్షాలు ఎంతకూ విడవటం లేదన్న చికాకును కొందరు ప్రదర్శిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాయంత్రం నుంచి మొదలైన భారీ వర్షాలతో తీవ్రమైన ట్రాఫిక్ కష్టాల్ని లక్షలాది మంది ఎదుర్కొన్నారు. ఆసక్తికరమైన ఒక అంశం ఏమంటే.. ఆదివారం రాత్రి వేళ దంచి కొట్టిన వాన మాదిరే బుధవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ రెండు రోజులకు ఉన్న పోలిక ఏమంటే.. ఉదయం పూట భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే.. సాయంత్రం వరుణుడు ఆగమాగం చేసిన పరిస్థితి.

Tags:    

Similar News