జీడీపీ లిస్టులో టాప్5లో స్థానాన్ని కోల్పోయిన హైదరాబద్.. కారణం ఇదేనా?

ఒకప్పుడు ‘భాగ్యనగరం’ అని గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ పేరు.. ఇప్పుడు దేశంలోని అత్యధిక జీడీపీ కలిగిన టాప్–5 నగరాల జాబితాలో కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.;

Update: 2026-01-23 05:54 GMT

ఒకప్పుడు ‘భాగ్యనగరం’ అని గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ పేరు.. ఇప్పుడు దేశంలోని అత్యధిక జీడీపీ కలిగిన టాప్–5 నగరాల జాబితాలో కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా.. అన్నీ ఉన్న నగరం అయినా సరే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సరసన హైదరాబాద్ ఎందుకు నిలబడలేకపోయింది? ఇదే ఇప్పుడు చర్చకు కేంద్రబిందువుగా మారింది. తాజా అంచనాల ప్రకారం దేశంలో అత్యధిక జీడీపీ కలిగిన నగరాల జాబితాలో ముంబై తొలి స్థానంలో ఉంది. దాదాపు ₹25.73 లక్షల కోట్ల ఆర్థిక పరిమాణంతో అది దేశ ఆర్థిక రాజధానిగా నిలుస్తోంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ₹24.37 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతా ₹12.45 లక్షల కోట్లు, బెంగళూరు ₹10.9 లక్షల కోట్లు, చెన్నై ₹9.5 లక్షల కోట్లతో టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోవడం సహజంగానే ప్రశ్నలు రేపుతోంది.

హైదరాబాద్ వెనుకపడడానికి ప్రధాన కారణం

నగర ఆర్థిక వ్యవస్థ స్వభావమే అని నిపుణులు చెబుతున్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు కేవలం ఒక రంగంపై ఆధారపడకుండా ఫైనాన్స్, తయారీ, ట్రేడ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థలు, హెడ్ ఆఫీసులు వంటి విభిన్న రంగాలతో విస్తరించాయి. ముఖ్యంగా ముంబైలో స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లు నగర జీడీపీని భారీగా పెంచుతున్నాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్రభుత్వ వ్యయం, రియల్ ఎస్టేట్, మాన్యుఫ్యాక్చరింగ్ కలిసివచ్చాయి.

హైదరాబాద్ విషయానికి వస్తే..

నగర ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఐటీ, ఐటీ సేవలు, ఫార్మా రంగాలకే పరిమితమైంది. ఇవి ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించినా, జీడీపీ లెక్కల్లో భారీ బరువు వేసే తయారీ రంగం మాత్రం నగర పరిధిలో పెద్దగా విస్తరించలేదు. బెంగళూరు కూడా ఐటీ నగరమే అయినా, అక్కడ స్టార్టప్ ఎకోసిస్టమ్, డీప్ టెక్, గ్లోబల్ ఆర్‌అండ్‌డీ సెంటర్లు నగర విలువను పెంచాయి. చెన్నైలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కీలకంగా మారాయి.

ఇంకో ముఖ్యమైన అంశం

హైదరాబాద్ జీడీపీ గణన విధానం. కొన్ని అధ్యయనాల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిమితులకే జీడీపీని లెక్కిస్తారు. అయితే బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో పరిసర ఎన్‌సీఆర్, మెట్రోపాలిటన్ ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలు కూడా కలుపుతారు. ఉదాహరణకు ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ లాంటి ప్రాంతాలు భారీగా కంట్రిబ్యూట్ చేస్తాయి. హైదరాబాద్ పరిసరాల్లో కూడా ముచ్చర్ల, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాలు ఎదుగుతున్నా, అవి ఇంకా పూర్తిగా జీడీపీ లెక్కల్లో ప్రతిబింబించలేదు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ట్రేడ్ హబ్‌గా ఎదగలేకపోవడం మరో బలహీనత. ముంబై, చెన్నై లాంటి పోర్ట్ నగరాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ భౌగోళికంగా మధ్యలో ఉండడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు ఎక్కువవుతాయి. దీనివల్ల భారీ తయారీ పరిశ్రమలు ఇక్కడికి రావడంలో కొంత వెనుకడుగు వేస్తున్నాయి. అయితే ఇదంతా హైదరాబాద్‌కు శాశ్వత లోటు అని చెప్పలేం. నగరంలో జరుగుతున్న తాజా పరిణామాలు భవిష్యత్తుపై ఆశలను పెంచుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, రీసెర్చ్ కారిడార్, సెమీకండక్టర్ ప్లాన్స్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్లు అమలులోకి వస్తే – హైదరాబాద్ జీడీపీ రూపురేఖలు మారే అవకాశం ఉంది. తూర్పు హైదరాబాద్, దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి దిశగా అడుగులు పడితే నగర ఆర్థిక విస్తీర్ణం పెరుగుతుంది.

హైదరాబాద్ వెనుకబడిన నగరం కాదు, కానీ ఇంకా తన పూర్తి సామర్థ్యాన్ని జీడీపీ లెక్కల్లో చూపించలేకపోయింది. ఐటీకి మించి పరిశ్రమలు, ట్రేడ్, తయారీ రంగాలపై దృష్టి పెట్టగలిగితే – భాగ్యనగరం మరోసారి టాప్ లిస్టుల్లో గర్వంగా నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు.

Tags:    

Similar News