హైదరాబాద్ పోలీసుల వార్నింగ్.. పిల్లలకు బండి ఇస్తే ఆర్సీ ఏడాది రద్దు!
పిల్లలు మారాం చేశారనో.. అదే పనిగా అడుగుతున్నారనో మీ వాహనం ఇచ్చే అలవాటు ఉందా? అయితే.. వెంటనే మానుకోండి.;
పిల్లలు మారాం చేశారనో.. అదే పనిగా అడుగుతున్నారనో మీ వాహనం ఇచ్చే అలవాటు ఉందా? అయితే.. వెంటనే మానుకోండి. లేదంటే ఈ అలవాటు మీకు బోలెడన్ని సమస్యలకు తెచ్చి పెట్టటం ఖాయం. ఇటీవల పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తెలిసి తెలియని వయసులో వాహనాన్ని నడుపుతూ నిండు ప్రాణాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. అలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు వీలుగా శనివారం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే వాహన యజమానిపై చట్టపరమైన కేసులు నమోదు చేయటమే కాదు.. కోర్టులో ఫైన్ లేదంటే జైలుశిక్ష ఖాయం. అంతేకాదు వాహన రిజిస్ట్రేషన్ (ఆర్సీ) ని కూడా 12 నెలల పాటు రద్దు చేస్తారు. ఇక్కడితో అయిపోలేదు. శిక్షల చిట్టాలో మరో కీలక అంశం కూడా ఉంది.
అదేమంటే.. డ్రైవింగ్ చేసిన మైనర్ కు పాతికేళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వకుండా చర్యలు విధిస్తారు. ఎందుకింత కఠినమన్న సందేహం రావొచ్చు. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో మైనర్ల డ్రైవింగ్ కారణంగా 7 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. ఈ మూడు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. మరో నాలుగు కేసుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారి విషయంలో కఠినంగా ఉండేలా చర్యలు షురూ చేయనున్నారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానికి 12 నెలల పాటు బండి మీద ఉన్న ఆర్సీని రద్దు చేస్తారు. మూడేళ్ల వరకు జైలు.. రూ.25వేల ఫైన్ విధించే వీలుంది. అదే సమయంలో బండి నడుపుతూ దొరికిన మైనర్లకు పాతికేళ్లు వచ్చే వరకు వారు డ్రైవింగ్ లైసెన్సు పొందే అవకాశం ఉండదు. సో.. పిల్లలకు (మైనర్లకు) బండి ఇచ్చే వారంతా వెంటనే ఆ తీరుకు చెక్ పెట్టాలి. లేదంటే.. అనవసర తలనొప్పులు కొని తెచ్చిపెట్టుకున్నట్లే. బీకేర్ ఫుల్.