నెదర్లాండ్స్ టు పోలాండ్, ఫ్రాన్స్: ఐబొమ్మ రవి మస్కా పనిచేయలేదు! చివరికి ఎలా దొరికాడంటే...
విదేశాల్లో దాక్కొని ఉన్నప్పటికీ.. పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారనే భయం రవిని చుట్టుముట్టిందని, ఇటీవల ఐదు రోజుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి.;
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌లు ఐబొమ్మ, బప్పం వంటి సైట్లను నడిపిస్తూ దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఇమంది రవి చివరకు అధికారులకు ఎలా చిక్కాడనే వివరాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. విదేశాల్లో దాక్కొని ఉన్నప్పటికీ.. పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారనే భయం రవిని చుట్టుముట్టిందని, ఇటీవల ఐదు రోజుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి.
* మొదట రవికి అనుమానం ఎలా వచ్చిందంటే...
పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసిన సర్వర్ల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పోలీసులు ఒక డొమైన్ నోడల్ అధికారిక ఫోన్ నంబర్‌ను సేకరించారు. ఆ వ్యక్తి రవి అని పోలీసులు మొదట గుర్తించలేదు. సాధారణంగా విదేశీ సంస్థల నుంచి సమాచారం పొందాలంటే అమెరికా అధికారుల అనుమతి అవసరం. అయితే ఈసారి నోడల్ అధికారినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి స్వయంగా పోలీసులకు ఒక మెయిల్ పంపాడు. అందులో “ఐబొమ్మ, బప్పం డొమైన్లలో పైరసీ సినిమాలు ఉన్నాయంటూ ఆధారాలు పంపండి” అని కోరడం పోలీసులకు పెద్ద అనుమానానికి దారితీసింది. ఆ డొమైన్ అధికారి రవి అని తెలుసుకున్నారు. మరోవైపు, పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారని, తాను నెదర్లాండ్స్‌లో ఉన్న విషయం వారికి తెలిసిపోయిందనే భయం రవిని వెంటాడింది. దీంతో అతను వెంటనే నెదర్లాండ్స్ నుంచి కదిలిపోయాడు.
*యూరప్‌లో 20 రోజుల చేజింగ్: ఆందోళనలో రవి
నెదర్లాండ్స్ నుంచి బయలుదేరిన రవి దాదాపు 20 రోజుల పాటు యూరప్‌లోని పోలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో దాక్కొని ఉన్నాడు. ఈ కాలంలో పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారా లేదా అనే ఆందోళనతోనే గడిపాడు. కస్టడీలో ఐదో రోజు విచారణలో రవి ఏకంగా పోలీసులను "నా కోసం నెదర్లాండ్స్‌కు వచ్చింది మీరేనా?" అని ప్రశ్నించడం అతని భయానికి, ఆందోళనకు నిదర్శనంగా నిలిచింది. నెదర్లాండ్స్‌లో తన చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారనే అనుమానం అతడిని వెంటాడినట్లు విచారణలో తేలింది. రవి యూరప్‌లో దాక్కొని ఉన్న ఈ 20 రోజుల్లో పోలీసులు అతనికి ఎలాంటి మెయిల్ పంపకపోవడంతో తను తప్పించుకున్నానని నమ్మాడు. ఈ ధైర్యంతోనే అతను స్వదేశం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడే అతను అధికారులకు చిక్కాడు.
* పోలీసుల వ్యూహం: ఆధారాలు పక్కా
రవిని అరెస్ట్ చేసిన తర్వాత, పోలీసులు అతనిని ఐదు రోజుల కస్టడీకి తీసుకొని కీలక సమాచారం సేకరించారు. కేసులో బలమైన ఆధారాలు ఉండేలా పక్కా ప్లాన్‌తో అధికారులు వ్యవహరించారు. నిందితుడి స్నేహితుల వివరాలు సేకరించారు. జరిపిన లావాదేవీలు ఆరాతీశారు. విదేశీ ఖాతాల మువ్మెంట్స్ వంటి వివరాలన్నింటినీ సేకరించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిటింగ్ బృందం ఈ లావాదేవీలను లోతుగా పరిశీలిస్తోంది. రవిపై నేరాన్ని నిరూపించడానికి ఈ ఆధారాలు కీలకం కానున్నాయి.
* జైలుకు రవి, మరో నాలుగు కేసుల్లో అరెస్ట్‌కు ఏర్పాట్లు
సోమవారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతనిపై ఉన్న మరిన్ని నాలుగు కేసుల్లో కూడా అరెస్ట్ చేసి, మళ్లీ కస్టడీకి తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.