గూగుల్‌కు ట్రాఫిక్ ఉందని ఎలా తెలుసు? మన ఫోన్లే గూగుల్‌కు అసలు సమాచారం
రెడ్ కలర్‌లో ట్రాఫిక్ ఎక్కువగా పసుపు రంగులో కొంత రద్దీగా, గ్రీన్ కలర్‌లో ట్రాఫిక్ సాధారణంగా ఉందని సూచిస్తుంది. మరి గూగుల్‌కు రోడ్డుపై ట్రాఫిక్ ఉందని ఎలా తెలుస్తుంది? దీని వెనుక మన స్మార్ట్‌ఫోన్లే కీలకంగా పనిచేస్తాయి.
నగరాల్లో ప్రయాణించే సమయంలో గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఏ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఎక్కడ రోడ్డు ఖాళీగా ఉంది? ఏ మార్గంలో వెళ్తే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు? వంటి వివరాలను గూగుల్ మ్యాప్స్ క్షణాల్లో మనకు చూపిస్తుంది. ముఖ్యంగా రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితిని వివిధ రంగులతో సులభంగా అర్థమయ్యేలా చూపిస్తుంది. రెడ్ కలర్‌లో ట్రాఫిక్ ఎక్కువగా పసుపు రంగులో కొంత రద్దీగా, గ్రీన్ కలర్‌లో ట్రాఫిక్ సాధారణంగా ఉందని సూచిస్తుంది. మరి గూగుల్‌కు రోడ్డుపై ట్రాఫిక్ ఉందని ఎలా తెలుస్తుంది? దీని వెనుక మన స్మార్ట్‌ఫోన్లే కీలకంగా పనిచేస్తాయి.
మన మొబైల్ ఫోన్ల నుంచే కీలక సమాచారం
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సేవలు లేదా జీపీఎస్ వినియోగిస్తున్నప్పుడు ఫోన్ కదలికకు సంబంధించిన లొకేషన్ డేటా ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక రోడ్డుపై అనేక ఫోన్లు సాధారణం కంటే చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు లొకేషన్ సిగ్నల్స్ ద్వారా గుర్తిస్తే.. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నెమ్మదించాయని గూగుల్ అంచనా వేయగలదు. అదే రోడ్డుపై ఫోన్లు వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తే అక్కడ ట్రాఫిక్ పెద్దగా లేదని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకే ప్రాంతంలో ఉన్న అనేక పరికరాల నుంచి లభించే కదలికల నమూనాలను విశ్లేషించడం ద్వారా రోడ్డు పరిస్థితిని అంచనా వేస్తుంది.
జీపీఎస్ ఒక్కటే కాదు.. మరిన్ని డేటా కూడా..
ట్రాఫిక్‌ను గుర్తించడానికి జీపీఎస్ డేటా ఒక్కటే ఆధారం కాదు. ఒక రూట్‌లో గతంలో నమోదైన ట్రాఫిక్ పరిస్థితులు, సాధారణంగా ఏ సమయంలో ఎంత రద్దీ ఉంటుందనే సమాచారం.. రోడ్లపై వేగ పరిమితులు.. మార్గాల వివరాలు వంటి అనేక అంశాలను కూడా గూగుల్ తన అంచనాల్లో పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు ప్రతిరోజూ ఉదయం ఒకే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఉంటే గత డేటా ఆధారంగా ఆ సమయంలో ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని మ్యాప్స్ అంచనా వేయగలదు. అదే సమయంలో ప్రస్తుతం రోడ్డుపై ఉన్న వాహనాల కదలికను కూడా పరిశీలిస్తుంది.
అందుకే ట్రాఫిక్ కలర్ మారుతూ ఉంటుంది
మ్యాప్స్‌లో కనిపించే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు కేవలం అలంకరణ కోసం కావు. రోడ్డు పరిస్థితిని త్వరగా అర్థం చేసుకునేలా గూగుల్ వాటిని ఉపయోగిస్తుంది. గ్రీన్ అంటే ట్రాఫిక్ సాధారణంగా ఉందని.. పసుపు అంటే కొంత రద్దీ ఉందని, రెడ్ అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండి వాహనాల వేగం తగ్గిందని సాధారణంగా అర్థం. అయితే మ్యాప్స్‌లో కనిపించే ట్రాఫిక్ సమాచారం ప్రతి క్షణం 100 శాతం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. రోడ్డు ప్రమాదాలు, అకస్మాత్తుగా జరిగే రోడ్ బ్లాక్‌లు, వాతావరణ పరిస్థితులు లేదా తాత్కాలికంగా ఏర్పడే రద్దీ వంటి వాటిని గుర్తించడానికి కొంత సమయం పట్టొచ్చు.
మొత్తంగా చూస్తే.. మన చేతిలోని స్మార్ట్‌ఫోన్లు కదులుతున్న తీరు, లొకేషన్‌కు సంబంధించిన సిగ్నల్స్, గత ట్రాఫిక్ నమూనాలు, రోడ్డు పరిస్థితులకు సంబంధించిన ఇతర సమాచారం వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్‌ను అంచనా వేస్తుంది. అంటే మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు.. మన ఫోన్ కదలికలే గూగుల్‌కు ఆ రోడ్డు పరిస్థితిపై ఒక ముఖ్యమైన సంకేతంగా మారుతున్నాయన్నమాట..