బీరువాలో 'బంగారక్క' నిద్రపోతోంది.. లేపడానికి ఢిల్లీ పెద్దల భారీ స్కెచ్!
మన భారతీయ ఇళ్లల్లో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదో ఎమోషన్. పెళ్లిళ్లయినా, పేరంటాలైనా, ఆఖరికి 'అవసరాలకైనా' అండగా ఉండేది ఆ పసిడి తల్లే.
మన భారతీయ ఇళ్లల్లో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదో ఎమోషన్. పెళ్లిళ్లయినా, పేరంటాలైనా, ఆఖరికి 'అవసరాలకైనా' అండగా ఉండేది ఆ పసిడి తల్లే. అందుకే మనవాళ్లు సంపాదనలో రూపాయి మిగిలినా దాన్ని తీసుకెళ్లి బీరువాలోనో, బ్యాంక్ లాకర్లలోనో భద్రంగా దాచేస్తుంటారు. అయితే ఇలా ఇళ్లల్లో, లాకర్లలో హాయిగా నిద్రపోతున్న ఆ 'బంగారక్క'ను బయటకు తీసి.. దేశ ఆర్థిక వ్యవస్థ పరిగెత్తేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ సిద్ధం చేస్తోందట.. అదేనండీ.. ఎప్పటినుంచో ఉన్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కు కాస్త మేకప్ వేసి.. కొత్త రూపంలో మన ముందుకు తేవడానికి రంగం సిద్ధమైంది.
బ్యాంకు దాకా ఎందుకు? పక్కింటి నగల షాపుకెళ్లిపోండి
"ఇంట్లో ఊరికే పడి ఉండే బంగారం మీద వడ్డీ ఇస్తాం, రండి బాబూ రండి" అని గతంలో ప్రభుత్వం మొత్తుకున్నా మనవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ బంగారాన్ని పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగడం, అక్కడి డాక్యుమెంట్లు చూసి భయపడటం మన వల్ల కాలేదు. మరి ఈసారి ప్లాన్ ఏంటో తెలుసా? ఇకపై మీరు బ్యాంకుల దాకా పరిగెత్తాల్సిన పనిలేదు. మీ వీధి చివర ఉండే, లేదా మీకు నమ్మకమైన గుర్తింపు పొందిన జువెల్లరీ షాపులు, నగల వ్యాపారుల దగ్గరికే వెళ్లి మీ బంగారాన్ని డిపాజిట్ చేసేయొచ్చు.
అంటే.. నగల దుకాణానికి వెళ్లి కొత్త నగలు కొనడం కాదు, ఇంట్లో ఉన్న పాత నగలను అక్కడ డిపాజిట్ చేసి.. దానిపై వడ్డీ సంపాదించుకోవాలన్నమాట. వినడానికి ఐడియా అదిరిపోయింది కదూ.. వచ్చే రెండు వారాల్లోనే ఈ కొత్త గైడ్‌లైన్స్ వచ్చే ఛాన్స్ ఉందట.
దేశం మారాలంటే.. బీరువాలు ఖాళీ అవ్వాల్సిందేనా?
అధికారుల లెక్కల ప్రకారం.. మన దేశంలో ఇళ్లల్లో మురిగిపోతున్న బంగారం విలువ ఎంతో తెలుసా? ఊహించలేనంత! అందులో కనీసం ఒక 5 శాతం బంగారం బయటకు వచ్చినా.. దాదాపు రూ. 8.58 లక్షల కోట్ల సంపద మన ఆర్థిక వ్యవస్థలోకి పరుగులు పెడుతుందట. ఈ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే ప్రభుత్వానికి లాభాలే లాభాలు.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డబ్బులు వెల్లువల వస్తాయి. విదేశాల నుంచి మనం టన్నుల కొద్దీ బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గి, రూపాయి మరింత స్ట్రాంగ్ అవుతుంది.
మరి మనవాళ్లు ఒప్పుకుంటారా?
ఐడియా అయితే సూపర్. ఇంట్లో ఊరికే లాకర్‌లో ఉంటే తుప్పు పట్టకపోయినా, రూపాయి ఆదాయం రాదు. అదే ఈ స్కీమ్‌లో పెడితే భద్రతతో పాటు వడ్డీ కూడా వస్తుంది. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. మన ఇంట్లో ఉండే నగల వెనుక బోలెడన్ని సెంటిమెంట్లు ఉంటాయి. "ఇది మా నానమ్మ పెళ్లి నాటి గాజులు", "ఇది మా అత్తగారు ఇచ్చిన హారం" అంటూ సెంటిమెంట్ల ఇనుప పెట్టెల్లో దాచుకున్న బంగారాన్ని, వడ్డీ ఆశ చూపించి బయటకు తీయడం అంత ఈజీనా? పైగా నగల షాపుల వాళ్ల దగ్గర డిపాజిట్ చేయాలంటే సామాన్యుడికి నమ్మకం కుదరాలి కదా!
ఏదేమైనా.. కొత్త స్కీమ్ పూర్తి రూపురేఖలు, వడ్డీ రేట్లు, అసలు నియమ నిబంధనలు బయటకు వస్తే గానీ ఈ 'గోల్డ్ హంట్' ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. చూద్దాం.. ఢిల్లీ పెద్దల ప్లాన్ చూసి మన బీరువాల్లోని బంగారం బయటకు వస్తుందో లేదో..