సగం బెడ్ అద్దెకు ఇచ్చేసి సంపాదిస్తోంది
కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలకు విరుగుడుగా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన 38 ఏళ్ల మహిళ ఒకరు మొదలుపెట్టిన హాట్ బెడ్డింగ్ ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.;
అద్దెకు తీసుకోవటం అన్నంతనే కారు.. బైక్.. ఎలక్ట్రికల్ వస్తువులు.. ఇలా చాలానే వస్తాయి. కానీ.. పడుకునే మంచాన్ని.. అందునా ఆ మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇస్తూ సంపాదించే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? అలా అని తేడా వ్యవహారమని భావిస్తే తప్పులో కాలేసినట్లే. కొవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలకు విరుగుడుగా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన 38 ఏళ్ల మహిళ ఒకరు మొదలుపెట్టిన హాట్ బెడ్డింగ్ ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
తన ఐడియాకు కార్యరూపం ఇవ్వటమే కాదు.. నెలకు మన రూపాయిల్లో రూ.54వేలు సంపాదిస్తోంది. ఇంతకూ ఈ హాట్ బెడ్డింగ్ యవ్వారం ఏంటి? దాన్ని ఎలా అమలు చేస్తారు? లాంటి ఆలోచనలు రావొచ్చు.. అక్కడికే వస్తున్నాం. క్వీన్స్ ల్యాండ్ కు చెందిన మోనిక్ జెరెమియా అనే మహిళ ఈ హాట్ బెడ్డింగ్ అనే కాన్సెప్టును క్రియేట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మిగిలిన వస్తువుల్ని ఎలా అయితే అద్దెకు ఇస్తామో.. అలానే మనం పడుకునే మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇవ్వటమే ఈ హాట్ బెడ్డింగ్. అయితే.. ఈ కాన్సెప్టులో కీలక అంశం ఏమంటే.. మంచంలో మనతో పాటు పడుకునే వారు ఎవరైనా సరే.. ఎలాంటి భావోద్వేగాలకు సంబంధం లేకుండా పడుకోవాలన్నదే ఆమె థియరీ.
హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వారు నిబంధనల్ని గౌరవించాల్సి ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా చక్కగా డబ్బులు సంపాదించొచ్చని ఆమె చెబుతున్నారు. ‘‘మీరు నాలానే సాపియో సెక్సువల్ అయితే శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చు. కరోనా సమయంలో జాబ్ కోల్పోయా. ఒంటరిగా ఉండేదాన్ని. ఆ టైంలోనే ఈ హాట్ బెడ్డింగ్ ఆలోచన వచ్చింది’’ అని ఆమె చెప్పారు.
తన తొలి క్లయింట్ తనకు తెలిసిన వ్యక్తేనని చెప్పిన ఆమె.. మొదట్లో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. రూల్స్ ను పాటిస్తూ రూమ్ షేర్ చేసుకున్నట్లే.. బెడ్ షేర్ చేసుకోవచ్చని ఆమె చెబుతోంది. కష్ట కాలంలో డబ్బు సంపాదించటానికి ఇదో చక్కటి ఐడియా అని ఆమె చెబుతోంది. అయితే.. అదంత తేలికైనా విషయం కాదన్న మాటను.. ఈ కాన్సెప్టు గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.