సముద్రంలో పడిన విమానం.. భయానక ప్రమాదం.. వీడియో
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (HKIA)లో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం జరిగింది.;
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (HKIA)లో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారీ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటి సముద్రంలోకి జారిపోయింది. ఈ దుర్ఘటనలో రన్‌వేపై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది అక్కడికక్కడే మరణించారు.
విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయినా.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లను రక్షక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు.
* ప్రమాద వివరాలు
విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎమిరేట్స్ కార్గో విమానం EK9788. దుబాయ్ (DXB) నుంచి హాంకాంగ్ (HKIA) కు బయలుదేరింది.. కార్గో జెట్ హాంకాంగ్ నార్త్ రన్‌వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా అదుపు తప్పింది. వేగంగా దూసుకెళ్లిన విమానం రన్‌వేపై ఉన్న ఒక గ్రౌండ్ వెహికల్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే రన్‌వే చివరిని దాటి నేరుగా ఆనుకుని ఉన్న సముద్ర జలాల్లోకి జారిపోయింది.
విమానం ఢీకొట్టిన గ్రౌండ్ వెహికల్‌లో ఉన్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. విమానం నీటిలో మునిగిన వెంటనే హాంకాంగ్ మెరైన్ , అగ్నిమాపక రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయి. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
* విమాన సర్వీసులపై ప్రభావం
ప్రమాదం జరిగిన వెంటనే హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్త్ రన్‌వేను తక్షణమే మూసివేశారు. అంతర్జాతీయ ట్రాఫిక్‌పై ప్రభావం పడకుండా ఉండేందుకు, రాకపోకలన్నింటినీ సౌత్ రన్‌వేపైకి మళ్లించారు. దీనివల్ల కొన్ని విమానాల రాకపోకల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది.
* విమానం, సంస్థ వివరాలు
ప్రమాదానికి గురైన EK9788 విమానం బోయింగ్ 737 శ్రేణికి చెందినదిగా గుర్తించారు. ఈ విమానాన్ని ఎమిరేట్స్ సంస్థ నుంచి తుర్కియేకు చెందిన ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది.
* దర్యాప్తుకు ఆదేశం – అనుమానిత కారణాలు
హాంకాంగ్ ప్రభుత్వం ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విమాన డేటా రికార్డర్లు (బ్లాక్ బాక్స్‌లు) స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రాథమిక అనుమానాలు
ల్యాండింగ్ సమయంలో వర్షం , తేమ కారణంగా రన్‌వే తడిగా ఉండడం కారణంగా తెలుస్తోంది. ల్యాండింగ్ దశలో విమానంలో సాంకేతిక లోపం లేదా బ్రేకింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తడం.
ఈ దుర్ఘటన హాంకాంగ్ విమానాశ్రయ చరిత్రలో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత తీవ్రమైన ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఎమిరేట్స్ కార్గో , ఏసీటీ ఎయిర్ లైన్స్ తరఫున సానుభూతిని తెలుపుతూ అధికారిక ప్రకటనలు విడుదలయ్యాయి.