భారత్‌ లో తగ్గిన హిందూ జనాభా... మైనారిటీల సంఖ్య..?

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-09 17:30 GMT

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటిదాకా టాప్ ప్లేస్ లో ఉన్న చైనాను గత ఏడాది ఏప్రిల్ లో భారత్ దాటేసింది! ఫలితంగా నాటికి మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఆ సంగతి అలా ఉంటే... భారత్ లో హిందూ జనాభా మాత్రం తగ్గుతుందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది.

అవును... భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ జనాభా వాటా తగ్గిందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఇందులో భాగంగా... 1950 - 2015 మధ్య భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతం వాటా 7.8 శాతం తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతంగా ఉన్న ఇస్లాం వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం వెల్లడించింది.

ఇందులో భాగంగా... భారత్ లో హిందూ మతస్తుల జనాభా తగ్గిపోగా.. ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని చెప్పింది. ఇదే సమయంలో... జైనులు, పార్సీల సంఖ్య మాత్రం తగ్గినట్లు వెల్లడించింది. పైన పేర్కొన్న మధ్య కాలంలో దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగిందని.. క్రైస్తవులు 5.38 శాతం, సిక్కులు 6.58 శాతం పెరుగుదలను చూశారని నివేదికే వెల్లడించింది.

ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ప్రకారం... 1950లో దేశంలో హిందువుల వాటా 84 శాతం ఉంటే, 2015లో అది 78 శాతానికి తగ్గగా.. ముస్లింల సంఖ్య 1950లో 9.84 శాతం ఉంటే.. 2015 నాటికి 14.19 శాతానికి పెరిగింది. అదేవిధంగా... భారత్‌ లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీగా ఉన్న హిందూ మతం జనాభా దాని వాటాలో 3.6 శాతం తగ్గిందని తెలిపింది!

ఇదే క్రమంలో భారత్ సరిహద్దుల్లోని ముస్లిం మతస్థులు మెజారిటీ ఉన్న దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ లో పరిస్థితి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆ రెండు దేశాల్లోనూ మెజారిటీ మతస్థులైన ముస్లిం జనాభా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇందులో... బంగ్లాదేశ్‌ లో అత్యధికంగా 18.5 శాతం, పాకిస్తాన్‌ లో 3.75 శాతం ముస్లిం జనాభా పెరిగిందని తెలిపింది.

Tags:    

Similar News