గంటలో 12సెం.మీ.: వర్ష బీభత్సంతో హైదరాబాద్ ఆగమాగం

వీకెండ్ వేళ హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న పరిణామాలు నగర జీవుల్నిఆగమాగం చేశాయి.;

Update: 2025-09-15 04:25 GMT

వీకెండ్ వేళ హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న పరిణామాలు నగర జీవుల్నిఆగమాగం చేశాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అదరగొట్టగా.. సాయంత్రం వేళ కాస్త చల్లబడింది. రాత్రి వేళకు అనూహ్యంగా మొదలైన వాన.. జడివానగా మారి.. కాసేపటికే కుండపోతగా కురిసింది. అదెంత ఎక్కువగా అంటే.. కేవలం గంట వ్యవధిలో 12 సెంటీమీటర్ల వర్షపాతంతో హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. తక్కువ వ్యవధిలో భారీ ఎత్తున వాన కురవటం ఈ మధ్యన పలుమార్లు హైదరాబాద్ లో చోటు చేసుకున్నా.. తాజా కుండపోతతో హైదరాబాద్ మహానగరానికి ప్రాణనష్టాన్ని తెచ్చి పెట్టింది.

గంట వ్యవధిలో భారీ ఎత్తున కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావటమే కాదు.. రహదారులు చెరువుల్లా మారాయి. ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. సెంట్రల్ హైదరాబాద్ లో మామా అల్లుళ్లు నాలా దాటే క్రమంలో జారి నీటిలో కొట్టుకుపోగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ ప్రాంతంలోని మంగారుబస్తీలో చోటు చేసుకున్న దురద్రష్టకర ఉదంతంలో మామ.. అల్లుళ్ల జాడ కనిపించలేదు. వీరి కోసం రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు జరిపినా వీరి ఆచూకీ లభించలేదు.

మరోవైపు.. ముషీరాబాద్ లో ఒక యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ డివిజన్ కు చెందిన 26 ఏళ్ల సననీ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న నాలా పక్కన ఉన్న గోడపై స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో నాలాలో పడిన యువకుడు కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు తాడుతో రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు గచ్చిబౌలిలోని నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ హాల్ ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి తక్షణ వైద్య సాయం కోసం ఆసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటల పాటు దంచికొట్టిన వర్షానికి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారీ వర్షం కారణంగా దోమలగూడ.. చిక్కడపల్లి.. గాంధీనగర్ లోని పలు కాలనీలు నీటమునగ్గా.. బోడుప్పల్.. పీర్జాదిగూడ.. కుషాయగూడ.. పోచారం.. నారపల్లి.. కాప్రా.. కీసర.. బషీర్ బాగ్.. కాచిగూడ.. నాంపల్లి.. అబిడ్స్.. కోఠి.. ఏంజే మార్కెట్.. బేగంబజార్.. ఎల్బీనగర్.. వనస్థలిపురం.. హయత్ నగర్.. అబ్దుల్లాపూర్ మెంట్.. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. మణికొండ..షేక్ పేట.. రాయదుర్గం.. గచ్చిబౌలి.. మియాపూర్.. మదీనాగూడ.. సికింద్రాబాద్.. కవాడీగూడ.. తదితర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. మొత్తంగా తాజాగా కురిసిన కుండపోత హైదరాబాద్ మహానగరాన్ని ఆగమాగం చేసిందని చెప్పకతప్పదు.

Tags:    

Similar News