92 ఏళ్ల వయసులో మాజీ ప్రధానికి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి
క్రియాశీల రాజకీయాల్లో 70 ఏళ్లకే వయోధికులు అంటూ ఉంటారు.. పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వస్తుంటాయి.;
క్రియాశీల రాజకీయాల్లో 70 ఏళ్లకే వయోధికులు అంటూ ఉంటారు.. పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వస్తుంటాయి. కానీ, 92 ఏళ్ల వయసులో భారత మాజీ ప్రధాని ఒకరు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడైన ఆయన.. జీవించి ఉన్న ఏకైక భారత మాజీ ప్రధాని కూడా. 30 ఏళ్ల కిందట ముఖ్యమంత్రిగా ఉంటూ అనూహ్యంగా ప్రధాని అయినా.. కేవలం పది నెలలు మాత్రమే పదవిలో కొనసాగగలిగారు. సాక్షాత్తు ప్రధానిగా చేసినందున తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రాలేక, కేంద్ర మంత్రిగానూ పనిచేయలేక కేవలం చట్ట సభల సభ్యుడిగా మిగిలిపోయారు. మొన్నటివరకు కూడా యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంగా కనిపిస్తూ బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. పార్లమెంటుకు క్రమం తప్పకుండా వెళ్తూ రాజకీయాల పట్ల తన నిబద్ధతను చాటుకునేవారు. కాకపోతే ఇటీవల కాస్త నెమ్మదించారు. తాజాగా ఆయన స్థాపించిన ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పార్టీ ఎన్నుకోవడం విశేషం.
75 ఏళ్ల కిందటే ఇంజనీరింగ్..
వ్యవసాయ కుటుంబంలో 1933 మే 18న పుట్టిన హర్దనహళ్లి దొడ్డగౌడ దేవెగౌడ (దేవెగౌడ) 1950ల ప్రారంభానికే సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ఒకప్పటి మైసూరు సామ్రాజ్యంలో భాగమైన హసన్ లో పుట్టి పెరిగిన దేవెగౌడ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. 1953లో కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా హొలెనరసిపుర నుంచి గెలిచారు. 1989 వరకు వరుసగా ఆరుసార్లు ఇక్కడినుంచే అసెంబ్లీకి వెళ్లారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్, జనతా పార్టీల్లో పనిచేశారు. 1989లో జనతాదళ్ చేరారు. కర్ణాటకలో 1994 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందడంతో దేవెగౌడ సీఎం అయ్యారు. 1996 వరకు ఆయన పదవిలో కొనసాగారు.
చంద్రబాబు సారథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ తో
1996 లోక్ సభ ఎన్నికల అనంతరం హంగ్ ఏర్పడడంతో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కీలక పాత్ర పోషించి.. యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు. వామపక్షాలు సహా పలు పార్టీల ఉన్న ఈ ఫ్రంట్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ, 10 నెలల్లోనే దిగిపోవాల్సి వచ్చింది. ఆపై ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21వరకు ప్రధాని ఉన్న దేవెగౌడ ఆ తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లోనే కొనసాగారు.
కర్ణాటకపై జేడీ(ఎస్) పట్టు..
దేవెగౌడ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లకున్నా... 1999లో జనతాదళ్ నుంచి విడిపోయి జనతాదళ్ (ఎస్-సెక్యులర్) పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేశారు. కుమారులు హెడ్ రేవణ్ణ, కుమారస్వామిలను రాజకీయంగా ప్రోత్సహించారు. కుమారస్వామి కర్ణాటకకు రెండుసార్లు సీఎంగా పనిచేయడం గమనార్హం. కర్ణాటకలో బలమైన సామాజిక వర్గమైన ఒక్కళిగ కులానికి చెందిన దేవెగౌడ రాజకీయాల్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా స్థిరంగా నిలిచింది. పడిపోయింది అనుకున్న ప్రతిసారీ పైకి లేచింది. తక్కువ సీట్లకే పరిమితం అయినా.. అవే కీలకం కావడంతో అధికారం పొందింది. ఇక రెండున్నరేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత తక్కువ సీట్లకు పరిమితం అయింది. కానీ, ఏడాది తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని లాభపడింది. కుమారస్వామి ప్రస్తుతం కేంద్రంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి కావడం గమనార్హం.