బీయారెస్ ని దించడం అంటే ప్రజలు రిస్క్ చేస్తున్నట్లేనా...?
అయితే తెలంగాణా ప్రజలను రిస్క్ చేయవద్దు అని బీయారెస్ కీలక నేత మంత్రి హరీష్ రావు కోరుతున్నారు. ఒక విధంగా హెచ్చరిస్తున్నారు.
రిస్క్ అంటే తెలుగులో దుస్సాహసం అని అర్ధం. ఎవరూ తెలిసి తెలిసి అలాంటి రిస్క్ చేయరు. అయితే తెలంగాణా ప్రజలను రిస్క్ చేయవద్దు అని బీయారెస్ కీలక నేత మంత్రి హరీష్ రావు కోరుతున్నారు. ఒక విధంగా హెచ్చరిస్తున్నారు. మరో విధంగా విన్నపాలూ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే అస్తవ్యస్థానికి మారు పేరు అయిన పార్టీ.
అలాంటి పార్టీని నెత్తికెత్తుకుని రిస్క్ చేయవద్దు అని ఆయన కోరుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సభలలో హరీష్ రావు ఏమన్నారు అంటే తెలంగాణాలో అంతా బాగుంది కదా. బీయారెస్ బండి సాఫీగా సాగిపోతోంది కదా. ఎందుకు రిస్క్ చేయడం అని ప్రజలను ఆయన అడుగుతున్నారు.
బీయారెస్ అంటేనే మేలైన పాలన అని చెబుతున్నారు. కేసీయార్ అంటే నమ్మకం అని కూడా అంటున్నారు. అలాంటి పాలనను వద్దు అని దూరం చేసుకోవద్దు అని ఆయన ప్రజలకే రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పాలన అంటే అభివృద్ధి ఉండదని, రైతు బంద్ రద్దు అవుతుందని, రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని కూడా హరీష్ రావు చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎందుకు ఇంతలా హరీష్ రావు కాంగ్రెస్ గురించి చెబుతున్నారు అన్నదే చర్చగా ఉంది. తెలంగాణాలో పోలింగుకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలత ఉంది. అయితే అది అధికారాన్ని తెచ్చేటంతగా మెజారిటీ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఇక బీజేపీ చతికిలపడిపోవడంతో డైరెక్ట్ ఫైట్ గా బీయారెస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది.
దాంతో కాంగ్రెస్ కి ఇది అడ్వాంటేజ్ గా మారింది. విపక్షం ఓట్లు అయితే ఒక్కటిగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అత్యధికం కాంగ్రెస్ ఖాతాలో పడేందుకు కూడా అనుకూలత ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ మీద బీయారెస్ గట్టిగా విరుచుకుని పడుతోంది. ఈ నేపధ్యంలో హరీష్ రావు రిస్క్ అన్న పదాన్ని కూడా వాడుతున్నారు.
రిస్క్ అన్నది ప్రజాస్వామ్యంలో కుదురుతుందా. అంటే ఉన్న చోటనే ఉంటూ ఒకే పార్టీని ఆదరించడం రిస్క్ అవదా. మార్పు అన్నదే ప్రజాస్వామ్యంలో ఎపుడూ ఉంటుంది. అలా మార్పు వద్దు అనుకోవడమే కదా రిస్క్ అవుతుంది అని మేధావులు అంటున్నారు. ఇక ఎంత బాగా పాలించినా ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీని కంటిన్యూ చేయడానికి ఇష్టం ఉండకపోవచ్చు. ఈసారి మరొకరికి చాన్స్ ఇద్దామని కూడా అనుకోవచ్చు.
అధికారంలో ఉన్న పార్టీని దించడం అంటే దాన్ని నెగిటివ్ కోణంలో ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా ఉంది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది. ఉమ్మడి ఏపీని రెండుగా విడగొట్టి మరీ ఇచ్చింది. ఒక విధంగా కాంగ్రెస్ చేసింది పొలిటికల్ గా బిగ్ రిస్క్. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం అంటే జనాలు రిస్క్ చేస్తున్నట్లా. హరీష్ రావు మాటలలో ప్రజలకు సూచనలు ఇస్తున్నట్లుగా ఉందా లేక బీయారెస్ లోని కలవరం బయటపెట్టుకుంటున్నట్లు గా ఉందా అన్నదే చర్చకు వస్తోంది.