మా ఫోన్లు, ఇంటి సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే కానీ, మాజీ మంత్రి హరీశ్ రావు నేరుగా 'కమాండ్ కంట్రోల్ సెంటర్' ను ఉటంకిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ, పోలీస్ వర్గాల వైపు వేలు చూపిస్తున్నాయి.;

Update: 2026-04-28 09:28 GMT

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే కానీ, మాజీ మంత్రి హరీశ్ రావు నేరుగా 'కమాండ్ కంట్రోల్ సెంటర్' ను ఉటంకిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ, పోలీస్ వర్గాల వైపు వేలు చూపిస్తున్నాయి. అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన ‘రిటైర్ అయినా వదిలిపెట్టం’ అనే హెచ్చరిక రాజకీయ వేడిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని, ఫోన్లతో పాటు ఇంటి ముందు ఉండే సీసీ కెమెరాలను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు వేసి, ఇదంతా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక 'కమాండ్ కంట్రోల్ సెంటర్' నుంచే జరుగుతోందని చెప్పడం రేవంత్ సర్కార్‌కు నేరుగా సవాలు విసిరినట్లయింది.

ఆరోపణల వెనుక సాంకేతిక కోణం

హరీశ్ రావు వాదన ప్రకారం, కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి సీసీ కెమెరాలను కూడా యాక్సెస్‌ను అధికారులు పొందుతున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరిని కలుస్తున్నారు? ఏయే ప్రాంతాలకు వెళ్తున్నారు? అనే అంశాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనాన్ని కేవలం నేర నియంత్రణకే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వేయడానికి వాడుతున్నారని ఆయన ఆరోపించారు.

అధికారులకు హెచ్చరిక

హరీశ్ రావు అధికారులను ఉద్దేశించి చేసిన హెచ్చరిక అత్యంత తీవ్రమైనది. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోం.. రిటైర్ అయినా చట్టం ముందుకు తెస్తాం’ అనడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ప్రభుత్వం తమపై నిఘా పెట్టి ఇబ్బంది పెడుతోందనే భయం కార్యకర్తల్లో కలగకుండా, వారికి అండగా ఉంటామనే సందేశాన్ని ఆయన ఈ మెసేజ్ ద్వారా కార్యకర్తల్లోకి పంపుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పుడు తాము ఇబ్బందులు పడతామనే భయాన్ని అధికారుల్లో కలిగించడం ద్వారా, తీవ్రత తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది.

సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూనే, వాటిని ఇప్పుడు కాకుండా ‘సమయం వచ్చినప్పుడు’ విడుదల చేస్తామని చెప్పడం వెనుక మరికొన్ని వాస్తవాలు ఉండే అవకాశం ఉంది. పూర్తిస్థాయి సాంకేతిక ఆధారాలను సేకరించడం, వాటిని కోర్టులో నిలబడేలా సిద్ధం చేయడానికి ఆయన టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల సమయంలోనో లేదంటే అసెంబ్లీ సమావేశాల సమయంలోనో ఈ సాక్ష్యాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది.

ఆరోపణలపై ఖండన..

ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. ‘గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులను జైలుకు పంపింది ఎవరు?’ అంటూ ఎదురుదాడికి దిగుతోంది. ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం పాత కేసుల విచారణే తప్ప, కొత్తగా ఎవరిపై నిఘా పెట్టలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

హరీశ్ రావు వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలేనా లేక ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందా..? అనేది తేలాల్సి ఉంది. అయితే, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం పారదర్శకత చాటుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత సాంకేతిక కేంద్రాలు కూడా వివాదాలకు నిలయాలుగా మారుతాయి.

Tags:    

Similar News