శ్రీశాంత్ ను భజ్జీ చెంపపై కొడితే.. అతడి కూతురు గుండెపై కొట్టింది
అత్యంత సంచలనంగా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి సీజన్ 2008లోనే తీవ్ర వివాదం... అప్పట్లో టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ గా ఉన్న హర్భజన్, ప్రధాన పేసర్ అయిన శ్రీశాంత్ ను గ్రౌండ్ లోనే చెంప దెబ్బ కొట్టాడు.;
అత్యంత సంచలనంగా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి సీజన్ 2008లోనే తీవ్ర వివాదం... అప్పట్లో టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ గా ఉన్న హర్భజన్, ప్రధాన పేసర్ అయిన శ్రీశాంత్ ను గ్రౌండ్ లోనే చెంప దెబ్బ కొట్టాడు. ఇది తీవ్ర క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించిన ఐపీఎల్ మేనేజ్ మెంట్.. హర్భజన్ ను ఆ సీజన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేసింది. అప్పటికి అతడు క్రికెట్ దేవుడు, క్రమశిక్షణకు పెట్టింది పేరైన సచిన్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. శ్రీశాంత్ పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్నాడు.
అసలు అనేక దేశాల ఆటగాళ్లతో కూడిన ఐపీఎల్ విజయవంతం అవుతుందా? లేదా? అని 2008లో అనుమానాలు నెలకొంటే.. భారతీయ కీలక ఆటగాళ్ల మధ్యనే వివాదం చోటుచేసుకోవడం కాస్త ఇబ్బందికర అంశమే అయింది. నాటి వివాదానికి కారణం.. శ్రీశాంత్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లపై స్లెడ్జింగ్ కు దిగడం. అసలే కాస్త నాన్ సీరియస్ గా, ఆవేశపరుడిగా కనిపించే శ్రీశాంత్ తీరు.. కోపం, సీరియస్ నెస్ ఉండే హర్భజన్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో శ్రీశాంత్ చెంప చెల్లుమంది. తొలి సీజన్ లో ఇదే పెద్ద విషయంగా మారింది.
కాగా, నాటి చెంపదెబ్బ ఘటనపై హర్భజన్ చాలాసార్లు స్పందించాడు. తాజాగా మరోసారి మాట్లాడాడు. శ్రీశాంత్ ను కొట్టడంతో అతడి కూతురు తననో విలన్ గా చూసిందని.. అదే కారణంతో తనతో మాట్లాడలేదని తెలిపాడు. ఆమె మాటలు వెంటాడుతూనే ఉన్నాయని పేర్కొన్నాడు. టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ యూట్యూబ్ చానల్ లో భజ్జీ ఈ వివరాలు పంచుకున్నాడు. శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన వైనంపై తాను పశ్చాత్తాపం చెందుతూనే ఉంటానని అన్నాడు. ఇప్పటికే చాలాసార్లు సారీ చెప్పిన సంగతిని గుర్తుచేశాడు. జీవితంలో మార్చుకోదగిన సందర్భం ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పాడు.
ఐపీఎల్ మ్యాచ్ లో ప్రత్యర్థులం అయినా... శ్రీశాంత్ తో కలిసి దేశానికి ఆడిన తాను అలా చేయకుండా ఉండాల్సిందని హర్భజన్ వివరించాడు. తర్వాత క్షమాపణ చెప్పినట్లు పేర్కొన్నాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తెకు మాత్రం తన తండ్రిని చెంపదెబ్బ కొట్టిన సంగతే గుర్తుందని.. ఓసారి ఆమెతో ప్రేమగా మాట్లాడదామని ప్రయత్నిస్తే.. ’’నువ్వు మా నాన్నను కొట్టావ్.. నీతో మాట్లాడను. ఆ మాటలు నా గుండెను తాకాయి’’ అని మొహం మీదే చెప్పిందని హర్భజన్ తెలిపాడు. తనను శ్రీశాంత్ కూతురు అలా చూడడం తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. భవిష్యత్ లో మాత్రం ఓ మంచి అంకుల్ గా చూడాలని భావిస్తున్నట్లు తెలిపాడు.