సెప్టిసెమిక్ షాక్ అంటే ఏమిటి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సమయంలో దీని ప్రమాదమెంత ?

సెప్టిసెమిక్ షాక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల శరీరంలో రక్తపోటు బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయవు.;

Update: 2025-05-18 19:30 GMT

నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బట్టతల ఒకటి. దీనికి పరిష్కారంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ చికిత్సలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒకే క్లినిక్‌లో ఇద్దరు ఇంజనీర్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మరణించడం కలకలం రేపింది. ఈ మరణాలకు ప్రధాన కారణం సెప్టిసెమిక్ షాక్ అని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాప్తి చెందడం వల్ల వస్తుంది.

సెప్టిసెమిక్ షాక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల శరీరంలో రక్తపోటు బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయవు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. నాణ్యత లేని చికిత్స, అనుభవం లేని వైద్యుల వల్లే రోగులు ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలు యువతలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌పై భయాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా, జుట్టు రాలడాన్ని నివారించడానికి సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల గురించి చర్చలు జరుగుతున్నాయి. నేటి యువతలో జుట్టు ఊడిపోతుందంటేనే చాలా భయపడుతున్నారు. కానీ నిజానికి జుట్టును కాపాడుకోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

జుట్టు రాలడాన్ని నివారించడానికి ఐరన్, ప్రొటీన్లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయలు, గుడ్డులోని తెల్లసొన, ఆకుకూరలు, బాదం, పచ్చి కొబ్బరి, బీరకాయ, క్యారెట్, ఆవాలు, శనగలు వంటి పదార్థాలు జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు పాలతో అర టీస్పూన్ మెంతి పొడిని కలిపి తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

వారానికి రెండుసార్లు కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ నూనెతో తలకు మర్దన చేసుకోవడం చాలా మంచిది. అలాగే నెయ్యి, నువ్వుల నూనె వంటి వాటిని సరైన మోతాదులో తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆహారంతో పాటు వ్యాయామం కూడా జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మెదడు, తలకు రక్త సరఫరా బాగా జరిగితే హెయిర్ ఫాలికల్స్ బలంగా తయారవుతాయి.

జుట్టు సంరక్షణలో చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఉదాహరణకు, రోజురోజుకు షాంపూలు మార్చడం, వేడి నీటితో తలస్నానం చేయడం, డ్రైయర్‌లు, స్ట్రెయిటెనర్‌లను తరచుగా ఉపయోగించడం వంటివి జుట్టును దెబ్బతీస్తాయి. అలాగే నిద్రలేమి, ధూమపానం, ఆల్కహాల్ వంటి అలవాట్లు కూడా జుట్టు నాశనానికి కారణమవుతాయి. వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

చివరిగా చెప్పాలంటే.. బలమైన జుట్టు కోసం ఎలాంటి సర్జికల్ చికిత్సలు అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత వంటి సహజమైన మార్గాలే మంచి జుట్టుకు అసలైన రహస్యం. కాస్త శ్రద్ధ పెడితే ఆరోగ్యంగా, సహజంగా ఉండే జుట్టు ఎప్పటికీ మీ సొంతం.

Tags:    

Similar News