H-4 వీసాపై ఉండి F-1 వీసాకు మారాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక

ఈ పరిస్థితిలో, చాలా మంది ఇమ్మిగ్రేషన్ నిపుణులు "అవును" అని నిజాయితీగా సమాధానం ఇవ్వడం ఉత్తమం అని సలహా ఇస్తారు.;

Update: 2025-07-06 13:30 GMT
H-4 వీసాపై ఉండి F-1 వీసాకు మారాలనుకునే విద్యార్థులకు  ముఖ్య గమనిక

అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయులకు, ముఖ్యంగా H-4 వీసాపై ఉండి F-1 వీసాకు మారాలనుకునే విద్యార్థులకు, I-539 ఫారమ్‌లోని కొన్ని ప్రశ్నలు గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే.. "మీ కోసం ఎప్పుడైనా ఇమ్మిగ్రెంట్ పిటిషన్ దాఖలైందా?" , "మీరు ఇమ్మిగ్రెంట్ వీసాకు దరఖాస్తుదారులా?" అన్నవి సమాధానం చెప్పలేకుండా ఉన్నాయి. ఇటీవలే ఒక యువతి తన అనుభవాన్ని ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. ఆమె తండ్రి తరపున I-140 అప్రూవల్ ఉంది, ఆమె పేరు ఆ పిటిషన్‌లో ‘డెరివేటివ్ బెనిఫిషియరీ’గా ఉంది. ఇప్పుడు ఆమె ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో అని అయోమయంలో ఉంది.

అసలు సమస్య ఎక్కడ?

మీరు గ్రీన్ కార్డ్ కోసం స్వయంగా దరఖాస్తు చేయకపోయినా USCIS (అమెరికన్ ఇమ్మిగ్రేషన్ శాఖ) దృష్టిలో మీరు ఏదైనా ఇమ్మిగ్రెంట్ పిటిషన్‌లో కనిపించినట్లయితే, అది ‘ఇమ్మిగ్రెంట్ ఇంటెంట్’గా పరిగణించబడవచ్చు. అంటే మీరు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని ఆశపడుతున్నారని వారు అర్థం చేసుకుంటారు. అయితే, F-1 వీసా మాత్రం పూర్తిగా నాన్-ఇమ్మిగ్రెంట్ ఇంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు చదువు పూర్తయిన తర్వాత దేశం వదిలి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ వీసా ఇస్తారు. I-140లో మీ పేరు ఉన్నందున ఈ రెండు విరుద్ధమైన ఉద్దేశాలు మీకు గందరగోళ పరిస్థితిని సృష్టించవచ్చు.

నిపుణుల సలహా ఏంటి?

ఈ పరిస్థితిలో, చాలా మంది ఇమ్మిగ్రేషన్ నిపుణులు "అవును" అని నిజాయితీగా సమాధానం ఇవ్వడం ఉత్తమం అని సలహా ఇస్తారు. మీరు ప్రత్యక్షంగా దరఖాస్తు చేయకపోయినా, మీ పేరు I-140 పిటిషన్‌లో ఉంటే అది పరిగణనలోకి తీసుకోబడుతుంది. కొంతమంది "లేదు" అని సమాధానం ఇవ్వడం వల్ల తక్షణ సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు తప్పుదోవ పట్టించారని USCIS భావించి భవిష్యత్తులో మరింత పెద్ద ఇబ్బందులలో పడే అవకాశం ఉంటుంది. USCIS ముందు నిజాయితీ చూపడం చాలా ముఖ్యం.

USCIS ఫారమ్‌లోని ప్రశ్నలు మీ దరఖాస్తుల గురించి మాత్రమే కాదు, అధికారిక రికార్డుల్లో మీ పేరు ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడానికే. ఒక చెక్‌బాక్స్ వదిలేయడమో, తప్పుగా నింపడమో మీ భవిష్యత్తుకు ప్రమాదం కలిగించవచ్చు.

మీ పేరు I-140లో డెరివేటివ్‌గా ఉన్నా సరే, మీరు "అవును" అని పేర్కొనడం మంచిది. నిజాయితీతో కూడిన సమాధానం ఎప్పుడూ సరైన మార్గం. మీకు ఏమైనా సందేహాలుంటే, నిపుణులైన ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News