వీధి పోరాటాలతో జ్ఞానేశ్ రాజీనామా సాధ్యమా ?
కేంద్ర ఎన్నికల సంఘం అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ మీద గతంలో ఎన్నడూ ఆరోపణలు రాలేదు.
కేంద్ర ఎన్నికల సంఘం అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ మీద గతంలో ఎన్నడూ ఆరోపణలు రాలేదు. అంతే కాదు సీఈసీ రాజీనామా అంటూ డిమాండ్లూ తలెత్తలేదు. చరిత్రలో తొలిసారిగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ విపక్షాలు పౌర సంఘాలు యువత అంతా రోడ్డెక్కుతున్నారు. ఢిల్లీ వీధుల్లో ఖాళీగా లేకుండా ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నారు. వరస నిరసనలు అన్నీ సీఈసీ ని ఆ మీదట మోడీ అమిత్ షాల మీద బాణాలు ఎక్కుబెట్టి సాగుతున్నాయి. అయితే ఎన్ని రోజులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసినా సీఈసీ రాజీనామా డిమాండ్ జరిగే పనేనా అన్నదే చర్చ.
ఒత్తిడి రాజకీయం :
నిజానికి సీఈసీ తప్పుకోవాలంటే రాజ్యాంగ సహితమైన నిబంధనలు ఉన్నాయి. పార్లమెంట్ లో అభిశంసన పెట్టాల్సి ఉంటుంది. దానికి మొత్తం సభలో మూడింట రెండు వంతుల మంది ఎంపీలు ఓటేయాలి. అది ఆమోద ముద్ర పడితే ఆ మీదట కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ని అభిశంసించవచ్చు. ఆయన రాజీనామా కోరవచ్చు. కానీ రాజీనామా చేయాలంటూ రోడ్లపైన ఆందోళనలు చేస్తే ఫలితం ఏముంటుంది అని అంటున్నారు. అయితే ఇదంతా ఒత్తిడి రాజకీయం అని అన్న వారూ ఉన్నారు. అయితే ఈ తరహా ఒత్తిడి రాజకీయాలు రాజకీయ పదవులలో ఉన్న వారి మీద ప్రయోగిస్తే చెల్లుతాయి కానీ కేంద్ర ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థ మీద చేస్తే అయ్యే పనేనా అని అంటున్నారు.
బదనం చేసేందుకేనా :
నిజానికి విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ మీదట ఎంపీల మద్దతు కూడగట్టాలి. లేదా పార్లమెంట్ లో చర్చకు పెట్టి మరీ అక్కడ తాము చెప్ప్దలచుకున్నవి అన్నీ కేంద్ర ఎన్నికల సంఘం మీద దాని పని తీరు మీద చెప్పాలి. అంతే తప్ప వీధులలో పోరాటాలు చేస్తూ డౌన్ డౌన్ అని నినదిస్తే ఉపయోగం లేదని అంటున్నారు. అయితే విపక్షాలు మొదటి ఆప్షన్ ఎందుకు ఎంచుకోవడం లేదు అంటే పార్లమెంట్ మూడింట రెండు వంతుల మెజారిటీ సీఈసీ అభిశంసనకు రావడం కష్టమే అన్నది తెలుసు అంటున్నారు. అందుకే రెండో ఆప్షన్ గా వీధుల్లోకి వస్తున్నారు అని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రాజకీయంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని బదమానం చేయవచ్చు అని జనాల్లోకి ఏదో జరిగిపోతోంది అన్న సమాచారాన్ని పంపించడం ద్వారా సర్కార్ ని సంకట పరిస్థితుల్లోకి నెట్టవచ్చు అని అంటున్నారు.
చట్టం కట్టుదిట్టం :
ఇక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విషయానికి వస్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనా కోరినంత సులువుగా ఆయనను కోరితే జరిగే పని కాదని అంటున్నారు. ఆయన రాజకీయాలకు అతీతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈ రోజున ఒకరు అడిగారు అని రాజీనామా చేస్తే రేపు ఇంకొకరు ఆ సీట్లో ఉన్నా డిమాండ్ పెడతారు, వీధి పోరాటాలు చేస్తారు, అపుడు ఆయన కూడా రాజీనామా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక దుస్సంప్రదాయానికి దారి తీస్తుంది అని అంటున్నారు. ఇక మోడీ అమిత్ షా రాజీనామా చేయించాలని అంటున్నారు. అది కూడా అయ్యేది కాదని తెలిసే ఈ డిమాండ్ అని చెబుతున్నారు. రాజ్యాంగం రక్షణ పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి కల్పించింది. కమిషనర్లను నేరుగా రాష్ట్రపతి బర్తరఫ్ చేయగలరు కానీ సీఈసీని పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారానే తప్పించాల్సి ఉంటుంది. అందువల్ల మోడీ షాలు కాదు కదా ఎవరూ ఏమీ చేయలేరని అంటున్నారు. మరి సీఈసీ తానుగా రాజీనామా చేయలేరు, ఎందుకంటే అది కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బ తీస్తుంది. ఆయన రాజీనామాను కోరే అవకాశం అధికారం ఎవరికీ లేరు, మరి ఎలా ఈ సమస్యకు పరిష్కారం అంటే ఆలోచించాల్సిందే మరి. ఏది ఏమైనా విపక్షాలు ఉద్యమించడానికి ఈ అంశం పదునైన బ్రహ్మాస్తంగా మారుతోంది అని అంటున్నారు.