బీఆర్‌ఎస్‌ కు మరో బిగ్‌ షాక్‌!

కాగా మరికొద్ది రోజుల్లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Update: 2024-04-29 06:45 GMT

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కు వరుస షాకులు తగులుతున్నాయి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి సమక్షంలో అమిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నల్గొండ/ భువనగిరి ఎంపీ సీట్లలో ఏదో ఒకదాన్ని గుత్తా అమిత్‌ రెడ్డి ఆశించారు. ఈ రెండింటిలో ఏదో ఒక సీటను తన కుమారుడికి ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి సైతం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను కోరారు. అయితే కేసీఆర్‌ ఇందుకు తిరస్కరించారు.

బీఆర్‌ఎస్‌ తరఫున నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డికి సీటు ఇచ్చారు. అలాగే భువనగిరి నుంచి క్యామ మల్లేశంను బరిలో దించుతున్నారు. దీంతో గుత్తా అమిత్‌ రెడ్డి తీవ్రంగా నిరాశ చెందారు.

Read more!

వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన అనంతరం శాసనమండలి చైర్మన్‌ గా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన చేరలేదు. ఇప్పుడు తన కుమారుడికి బీఆర్‌ఎస్‌ సీటు దక్కకపోవడంతో ముందుగా అతడిని కాంగ్రెస్‌ లోకి పంపారనే చర్చ జరుగుతోంది.

పరిణామాలను బేరీజు వేసుకున్నాక కొద్ది రోజుల్లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి సైతం కాంగ్రెస్‌ లో చేరతారని టాక్‌ నడుస్తోంది. 1999లో టీడీపీ తరఫున న ల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. 2004లో నల్గొండ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009, 2014 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన మరో రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. మొత్తం మీద మూడుసార్లు గుత్తా సుఖేందర్‌ రెడ్డి లోక్‌ సభ సభ్యుడిగా విజయం సాధించారు.

2019, 2021ల్లో రెండుసార్లు ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనే శాసనమండలి చైర్మన్‌ గా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News